
Kanna Lakshminarayana: కన్నా లక్ష్మీనారాయణ అకాల నిష్క్రమణతో బీజేపీ షాక్ లో ఉంది. జాతీయ స్థాయిలో అధికారం ఉన్న పార్టీ అది. మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన బీజేపీని వీడడం సాహసంతో కూడుకున్న పనే. కన్నా అంతవరకూ తెగించి కాషాయ పార్టీకి గట్టి షాకిచ్చారు. ఇప్పుడు టీడీపీలో అడుగుపెట్టక ముందే ఆ పార్టీలో మరో ముసలానికి కారణమవుతున్నారు. టీడీపీలో ఆయన చేరికకు రాజకీయ ప్రత్యర్థులు అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఒక సామాజికవర్గంనేతలు హైకమాండ్ వద్దే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీలో చేరిన కొద్దిరోజులకే కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ పెద్దలు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కానీ గత ఎన్నికల్లో ఘోర ఓటమితో బాధ్యతల నుంచి తప్పించారు. కన్నాకు గిట్టని సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా పార్టీని వీడారు. అయితే కన్నా ఏ పార్టీలో ఉన్నా ఆయనకు ప్రత్యర్థులు ఎక్కువ. 2014కు ముందు గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లో ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న వైరం నడిచేది. రాష్ట్ర విభజన తరువాత రాయపాటి టీడీపీలో చేరారు. కన్నా బీజేపీ గూటికి వెళ్లారు. ఇప్పుడు రాయపాటి టీడీపీలో ఉన్నా వయోభారంతో బాధపడుతున్నారు. ఇప్పుడు కన్నా టీడీపీలో ఎంట్రీ కానుండడంతో అడ్డుకునేందుకు రాయపాటి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతానికి రాయపాటే బయటపడుతున్నారు. కానీ చాలా మంది కమ్మ సామాజికవర్గం నేతలు కన్నా ఆగమనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాయపాటి అయితే కన్నా ఒక నాయకుడే కాదన్నట్టు తేల్చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధినేత మాత్రం సత్తెనపల్లి కానీ.. గుంటూరు పశ్చిమ సీటుకానీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కమ్మ సామాజికవర్గం నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

సత్తెనపల్లి స్థానం నుంచి గత ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు పోటీచేశారు. ఈ ఎన్నికల్లో పోటీకి ఆయన తనయుడు శివరాం సిద్ధపడుతున్నారు. అన్నిరకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకా టీడీపీలో ఎంటర్ కాక మునుపే కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించడం కలకలం సృష్టిస్తోంది. పోనీ సత్తెనపల్లి నుంచి కన్నా పోటీచేస్తే కోడెల కుటుంబాన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగులుతోంది. పోనీ నరసారావుపేట పంపిస్తారంటే ఇప్పటివరకూ అక్కడ ఉన్న నాయకుల పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేదు.
కన్నా టీడీపీలో చేరక ముందే పెద్ద ముసలం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం నాయకుల నియోజకవర్గాల్లో ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నారు. ఇన్నాళ్లూ సేఫ్ జోన్ లో ఉన్నామని.. కాపు నాయకుడి చేరికతో హైరానా పడాల్సి వస్తోందని కమ్మ సామాజికవర్గం నేతలు తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.తమ కులంలో సీనియర్ అయిన రాయపాటి వద్ద పంచాయితీ పెడుతున్నారు దీంతో తన వయోభారం లెక్కచేయకుండా రాయపాటి చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.