https://oktelugu.com/

AP Govt : ప్రభుత్వ ఉద్యోగాలు లేవు.. ప్రైవేటు కొలువులు కానరావు… ఇదేంది జగనన్న

అసలు రాష్ట్రంలో నిరుద్యోగం అన్నదే లేనట్టు ప్రకటనలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత మాత్రం.. జగన్ను నమ్మి నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 13, 2023 / 06:13 PM IST
    Follow us on

    AP Govt : జగన్ సర్కార్ నిరుద్యోగ యువతను దారుణంగా వంచించింది. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు జగన్ ఊరూరా ప్రకటనలు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతోంది. కానీ ఆయన చెప్పిన లక్షల ఉద్యోగాలు లేవు. కనీసం వేలు,వందల సంఖ్యలో కూడా నియామకాలు చేపట్టలేదు. ఏమైనా అడిగితే సచివాలయ ఉద్యోగాల కోసం ఆర్భాటంగా చెబుతున్నారు. ప్రతిపక్షంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ యువతను మభ్యపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కడ ఖాళీలు లేకుండా భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నాం. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడొద్దు. జనవరి అనేది ఎంతో దూరంలో లేదు. మళ్లీ జనవరి వస్తుంది.. ఆ తర్వాత ఏడాది జనవరి వస్తుందని గుర్తు పెట్టుకోమని చెబుతున్నా.. అంటూ జాబ్ క్యాలెండర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేకపోయారు. నాలుగు జనవరిలు దాటినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దాఖలాలు లేవు.

    గత నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు రావడం లేదు. అటు పరిశ్రమల జాడలేదు. దీంతో ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకువెళ్లాల్సి వస్తోంది.తాను అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తానన్న జగన్.. నిరుద్యోగ యువత గురించే మాట్లాడడం మానేశారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన అన్నది సాధారణంగా ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. అయితే వైసీపీ సర్కార్ హయాంలో ప్రైవేటు ఉద్యోగాలు సైతం తగ్గుముఖం పట్టడం విశేషం.

    గత నాలుగేళ్లుగా ఉద్యోగ నియామక ప్రక్రియ జరగలేదు. 2021 జూన్ 18న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం 36 పోస్టులను మాత్రమే కేటాయించారు. ఈ ప్రకటన చూసి నిరుద్యోగులు విస్తు పోయారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో.. 9 నెలల తర్వాత గ్రూప్ 1 లో 110, గ్రూప్ 2 లో 130 పోస్టులను అదనంగా కలిపారు. అన్నీ కలిపినా 276 పోస్టులు మాత్రమే.

    ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ కూడా ప్రకటించలేదు. ఈ నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా రాలేదు. 2014లో టిడిపి ప్రభుత్వ హయాంలో 11 వేల ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 2018 డీఎస్సీలో 7900 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్.. అసలు ఇది ఒక ఉద్యోగాలేనా? అని వ్యంగ్యంగా మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయకపోగా.. ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దు చేస్తున్నారు. 4760 ఎస్జీటీ ఉద్యోగాల భర్తీని రద్దు చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భవిష్యత్తులో కూడా భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.

    అటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా దక్కకుండా పోతున్నాయి. దీనికి జగన్ సర్కార్ చర్యలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్న పరిశ్రమలు పారిపోతుండగా.. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. కానీ జగన్ సర్కార్ కనీసం స్పందించిన దాఖలాలు లేవు. సచివాలయ ఉద్యోగాలనే తమ ప్రగతి అని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ఉపాధిని అందించామని ఆర్భాటం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగం అన్నదే లేనట్టు ప్రకటనలు చేస్తున్నారు. నిరుద్యోగ యువత మాత్రం.. జగన్ను నమ్మి నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.