Homeజాతీయ వార్తలుIndependence Day 2023: దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే

Independence Day 2023: దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే

Independence Day 2023: మువ్వన్నెల పతాకం చూడగానే ప్రతి భారతీయుడి మనసూ ఆనందంతో, గర్వంతో ఉప్పొంగుతుంది. అయితే, మనమంతా ఇప్పుడు ఎగురవేస్తున్న జాతీయ పతాకం రూపకల్పన వెనుక ఎన్నో ఆలోచనలు, ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి.

వందేమాతరం’, వజ్ర ముద్ర

భారత జాతీయ పతాకానికి సంబంధించిన తొలి వెర్షన్‌.. స్వామి వివేకానంద శిష్యురాలైన సిస్టర్‌ నివేదిత 1904లో రూపొందించిన జెండానే. అయితే అది దీర్ఘచతురస్రాకారంలో కాక.. నలుచదరంగా ఎర్రటి రంగులో ఉండేది. చుట్టూ పసుపు రంగు డిజైన్‌, మధ్యలో వంగ భాషలో ‘వందేమాతరం’, వజ్ర ముద్ర ఉండేవి.

గోరువంక, సూర్యుడి చిత్రాలు

రెండో అనధికారిక జాతీయ పతాకం దీర్ఘచతురస్రాకారంలో.. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో ఉండేది. పైనున్న ఆకుపచ్చ భాగంలో ఎనిమిది శ్వేత పద్మాలు, మధ్యలో పసుపు రంగు పట్టీలో దేవనాగరి లిపిలో ‘వందేమాతరం’, కింద ఉన్న ఎరుపు భాగంలో హిందూ, ముస్లిం మతాలకు చిహ్నంగా గోరువంక, సూర్యుడి చిత్రాలు ఉండేవి. ఆ జెండాను 1906 ఆగస్టు 7న కలకత్తా (నేటి కోల్‌కతా)లోని పార్సీ బాగన్‌ స్క్వేర్‌లో ఎగురవేశారు.

బెర్లిన్‌ ఫ్లాగ్‌

బెర్లిన్‌ కమిటీ ఫ్లాగ్‌.. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధురాలు భికాజీ కామ 1907 ఆగస్టు 22న పారి్‌సలో ఈ పతాకాన్ని ఎగురవేశారు. విదేశీ గడ్డపై ఎగిరిన తొలి భారత జాతీయ పతాకం ఇది. భికాజీ కామ, వీర్‌సావర్కర్‌, శామ్‌జీ కృష్ణవర్మ కలిసి రూపొందించిన పతాకం ఇది. పైభాగంలో కాషాయ రంగు, ఎనిమిది పద్మాలు ఉంటాయి. కింద పసుపు, ఆకుపచ్చ రంగు భాగాలు… వందేమాతరం, సూర్యచంద్రుల చిహ్నాలు ఉంటాయి. దీనికి మరో వెర్షన్‌ కూడా ఉంది. అందులో.. కాషాయ భాగంలో ఎనిమిది పద్మాలకు బదులు ఒక పద్మం, ఏడు నక్షత్రాలు ఉంటాయి. ఆ ఏడు నక్షత్రాలూ సప్తర్షి మండలానికి చిహ్నాలు.

హోమ్‌రూల్‌ ఫ్లాగ్‌..

1917లో డాక్టర్‌ అనిబిసెంట్‌, లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ ఎగురవేసిన జెండా ఇది. ఇందులో ఐదు ఎర్రటి, నాలుగు ఆకుపచ్చ రంగు పట్టీలు ఒకదానితర్వాత మరొకటి ఉంటాయి. సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలు.. ఎడమవైపు పై భాగంలో యూనియన్‌జాక్‌, కుడివైపు గోరువంక, దానిపైభాగంలో సూర్యుడి చిహ్నాలు ఉంటాయి. బ్రిటిషర్ల ఆధ్వర్యంలో స్వపరిపాలన అనే భావనతో రూపొందించిన పతాకం ఇది.

మహాత్మాగాంధీ జెండా

1921.. ఇది మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు పట్టీలు ఉంటాయి. పైభాగంలో గాంధీజీ రాట్నం ఉంటుంది. 1921లో ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు గాంధీజీ హాజరైనప్పుడు పింగళి వెంకయ్య ఈ పతకాన్ని గాంధీజీకి ఇచ్చారు. ఆ జెండా పైభాగంలో తెలుపు రంగు చేర్చాలని బాపూజీ ఆయనకు సూచించారు.

స్వరాజ్‌ ఫ్లాగ్‌

ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులతో 1921లో రూపొందించిన జెండా అందరినీ ఆకట్టుకోకపోవడంతో త్రివర్ణ పతాకంలోని రంగులను కాషాయం, తెలుపు, ఆకుపచ్చగా మార్చారు. మధ్యలో ఉన్న తెలుపు భాగంలో రాట్నాన్ని ఉంచారు. దీన్ని స్వరాజ్యపతాకంగా అభివర్ణించారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌ దీన్ని ఆమోదించింది.

జాతీయ పతాకం..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. జాతీయ పతాకాన్ని ఎంచుకోవడానికి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న స్వరాజ్‌ ఫ్లాగ్‌లో చిన్న మార్పు చేసి 1947, జూలై 22న దాన్ని జాతీయ పతాకంగా ఎంపిక చేసింది. ఆ మార్పు ఏంటంటే.. రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని ఉంచడం. 1947 ఆగస్టు 15న ఆ కొత్త జెండానే ఎగురవేశారు. అలా మనందరం ఇప్పుడు ఎగరేస్తున్న జాతీయ జెండా ఉనికిలోకి వచ్చింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular