Preethi : ఒక మరణం.. ఎన్నో అనుమానాలు. తనంతట తానే చనిపోయిందా? లేక చంపేశారా? ప్రీతి మృతిపై ఎన్నో డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఓవైపు సైకో సైఫో వేధిస్తున్నాడు.. తట్టుకోలేక చదువు మానేద్దామంటే సవాలక్ష రూల్స్. ఇలా ప్రీతి ఎన్నో భయాలతో సతమతం అయినట్టు తెలుస్తోంది. ఎంబీబీఎస్ పీజీ సీటు రావడం మామూలు విషయం కాదు. ఊరు గాని ఊరిలో ఒంటరిగా కుటుంబానికి దూరంగా చదువు అంటే ఎంతో ధైర్యం ఉండాలి. పైగా మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం కూడా ఓ సవాల్. తరగతులతోపాటు ప్రాక్టికల్ గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పని చేయాలి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ చాలెంజ్ లాంటిదే. సైఫ్ లాంటి ఆకతాయిలుంటే అంతే సంగతులు. సైఫ్ వేధింపులు తట్టుకోలేక మధ్యలో మానేద్దామని అనుకుంటే.. అడ్మిషన్ బాండ్ కింద రూ.లక్షలు కట్టాల్సి రావడంతో ఆమె ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని అంటున్నారు.
రూ.50 లక్షల అగ్రిమెంట్‌పై సంతకం..
పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ రూ.50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నాక కారణాలేవైనా కోర్సు మధ్యలో డ్రాప్ అయితే.. ఆ మొత్తం తిరిగి కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెల్లించాలి. ఇదే ఇప్పుడు ప్రీతి మరణానికి మరో కారణం అన్న వాదన వినిపిస్తోంది. గతేడాది వర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలోనే ఆపేస్తే రూ.20 లక్షలు చెల్లించాలన్న నిబంధన ఉండేది. అయితే.. చాలామంది విద్యార్థులు మధ్యలోనే వెళ్లిపోతున్నారన్న కారణంతో ఆమోత్తాన్ని ఈ ఏడాది రూ.50 లక్షలకు పెంచారట. దీంతో చాలామంది విద్యార్థులు వేధింపులు, ర్యాగింగ్, ఇతరత్రా ఏం ఉన్నా వాటిని భరిస్తూ పీజీ పూర్తి చేస్తున్నారని టాక్.
Also Read: MLC Kavitha: కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత.. తెరవెనుక సంగతులివీ
11 అనుమానాలు..
కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టగా, ప్రత్యేక బృందం ఇంకా లోతుగా విచారిస్తోంది. సైఫ్ చెప్పిన సమాచారాన్ని బట్టి సాంకేతికంగా ఏం చేయొచ్చు..? ఎలా ముందుకెళ్లొచ్చు..? అని పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. ప్రీతి విషయంలో అసలేం జరిగింది..? ప్రీతి ఇంజక్షన్ తీసుకున్నప్పటి నుంచి నిమ్స్ తరలించే వరకూ ఏమేం జరిగింది..? అనే విషయాలపై లంబాడాల ఐక్య వేదిక 11 ప్రశ్నలు లేవనెత్తుతోంది.
1. విధుల నిర్వహణలో ఉన్న ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగా మొదట చూసిందెవరు..?
2. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతి చేయి ఎందుకు కమిలి పోయింది..?
3. ప్రీతి అపస్మార స్థితిలో ఉన్న సమయం నుంచి ప్రీతి తండ్రికి ఫోన్ వచ్చే వరకు మధ్యలో ఏం జరిగింది..? ప్రీతి అపస్మారక స్థితిలో ఉండగానే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు..?
4. ఫింగర్ ప్రింట్ లాక్‌లో ఉన్న ప్రీతి మొబైల్ డాటాను, అలాగే వారి బ్యాచ్‌మెట్‌లతో చేసిన చాట్‌ను డిలీట్ చేసిందెవరు..?
5. ప్రీతి మొబైల్‌లో హిస్టరీ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది..? హిస్టరీలో డ్రగ్ గురించి సెర్చ్ చేశారని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాని మీదనే కేసును తప్పుదోవ ఎందుకు పట్టించారు..?
6. ప్రీతి తండ్రి రాక ముందే అన్ని డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లు అక్కడికి ఎందుకొచ్చారు..?
7. వరంగల్‌కు ప్రీతికి చేసిన చికిత్స ఏమిటి..?
8. మంచి చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొని వచ్చిన వారు నిమ్స్‌లో ఎలాంటి చికిత్స చేశారు..?
9. సైఫ్‌తోపాటు ఈ కేసులో భాగస్వాములు అయిన వారి పేర్లు ఎందుకు చేర్చలేదు..?
10. డిపార్ట్‌మెంట్ హెడ్.. ప్రీతిని ‘నాకు చెప్పకుండా ప్రిన్సిపాల్ దగ్గరికి పోతారా’ అని ఎందుకు బెదిరించారు..?
11. పోలీసు వ్యవస్థ ఈ కంప్లయింట్ రాగానే ఎందుకు నిర్లక్ష్యం వహించింది..? అన్న సందేహాలు లేవనెత్తింది. నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
8 డిమాండ్స్..
1. సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో ఎస్టీ ఐపీఎస్, ఎస్సీ ఐపీఎస్, బీసీ ఐపీఎస్.. ఎస్టీ, ఎస్టీ, బీసీ డాక్టర్స్ ఉండాలి.
2. సైఫ్, మిత్ర బృందంను సస్పెండ్ చేయాలి.
3. డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రిన్సిపాల్ ను సర్వీస్ నుంచి తొలగించాలి.
4. సీఐ బోనాల కిషన్‌ను సర్వీస్ నుంచి తొలగించాలి
5. రూ.50 లక్షల బాండ్‌ను పీజీ విద్యార్థులకు తక్షణమే రద్దు చేయాలి.
6. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి.
7. ప్రీతి కుటుంబంలో ఒకరికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగం కల్పించాలి.
8. ప్రీతి బాయి కుటుంబానికి 3 ఎకరాల భూమిని, ఇంటిని నిర్మించి ఇవ్వాలి.
బ్లాక్ కలర్ బ్యాగే కీలకం..
మరోవైపు.. పోలీసు విచారణ మొత్తం మీద ప్రీతి బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగ్ కీలకంగా మారిందని తెలియవచ్చింది. బ్యాగ్‌లోని మొత్తం 24 ఆధారాలతో కేసును పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో మాజ కూల్ డ్రింక్ అనుమానాస్పదంగా మారింది. దీంతోపాటు లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ గురించి కూడా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంజీఎం సెక్యూరిటీ గార్డులు రాజబోయిన సాంబరాజు, ఎర్రోజు కిశోర్ నుంచి విచారణాధికారి కీలక వివరాలు సేకరించారని సమాచారం. ఇలా మొత్తం అన్ని కీలక వివరాలను సేకరించిన పోలీసులు.. డాక్టర్ సైఫ్ నుంచి సేకరించిన సాంకేతిక ఆధారాలను పోల్చుతూ విచారణ కొనసాగిస్తున్నారు.
అయితే విచారణలో ఏం జరుగుతోంది..? ఏం వివరాలు సేకరించారు..? కేసు ఎంతవరకు వచ్చింది..? అనే విషయాలు మాత్రం ఇంతవరకూ అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వలేదు. చాలా గోప్యంగానే పోలీసులు విచారిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అతి త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Also Read: Bholaa Official Trailer : భోళా ట్రైలర్ రివ్యూ: కథ పూర్తిగా మార్చారు.. రిజల్ట్ ఏమవుతుందో?