Rajahmundry – Jana Sena: ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జనసేనాని వరుసగా షాక్ ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువత జనసేనలో చేరుతున్నారు. తాజాగా అధికార వైసీపీకి చెందిన నాయకులు, యువకులు కూడా ఆ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నారు. వైసీపీ ఎంపీకి మార్గాని భరత్‌కు మంచి పట్టు ఉన్న రాజమండ్రిలోనూ వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.

24వ డివిజన్ యువత జనసేనలోకి…
రాజమండ్రి ఎంపీగా వైసీపీ యువనేత మార్గాని భరత్ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా యువత మార్గాని వెంట నడిచింది. ఆయన గెలుపుకోసం కృషి చేసింది. భరత్ యుకుడు కావడంతో వచ్చే గెలిచిన తర్వాత తమకు అండగా ఉంటాడని యువత భావించింది. కానీ మూడేళ్లయినా భరత్ తన విజయానికి సహకరించిన యువతను పట్టించుకోవడం లేదు. అయినా గతేడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ కార్పొరేటర్లను గెలిపించారు. రెండోసారి ఎంపీ నమ్మకాన్ని నిలబెట్టారు. కానీ ఎంపీ యువతను ఎన్నికల వరకే వాడుకుని వదిలేస్తున్నారని వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ బలంగా ఉన్న రాజమండ్రి యువనేతలు పక్కచూపు చూస్తున్నారు. తాజాగా 24వ డివిజనకు చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన యువకులు వైసీపీని వీడి వైవీడి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఇది వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
క్యాడర్‌ను కాపాడుకోలేకపోతున్న ఎంపీ..
ఏ పార్టీకి అయినా క్యాడర్ బలంగా ఉంటేనే లీడర్‌కు విజయం సులభం అవుతుంది. కానీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాత్రం క్యాడర్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే అవకాశాన్ని జనసేన తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. యువ ఎంపీ నిర్లక్ష్యం చేసిన క్యాడర్‌ను జనసేవ వైపు మళ్లించడంలో రాజమండ్రి జనసేన నేతలు విజయవంతం అవుతున్నారు. తద్వారా జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు, అధికార వైసీపీని బలహీనపరుస్తున్నారు. కాగా, అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీ భరత్ మాత్రం క్యాడర్‌కు పనిచేయడంలో, కాపాడుకోవడంలో విఫలం అవుతున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

నీరుగారుతున్న జగన్ లక్ష్యం..
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 23 ఎంపీ స్థానాలు గెలవాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు, నేతలను క్షేత్రస్థాయిలో ఉండాలని, క్యాడర్‌నుకాపాడు కుంటూ ప్రజలకు దగ్గర కావాలని ఇటీవల దిశానిర్దేశం చే శారు. కానీ, రాజమండ్రిలో పరిస్థితి జగన్ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వైసీపీ క్యాడర్ పార్టీని వీడుతోంది. ఇందుకు ఎంపీ భరత్ తీరే కారణమని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాజమండ్రి స్థానం చేజార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.