YCP: వైసిపి నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలు ఎక్కడికక్కడే అట్టర్ ఫ్లాప్ గా మిగులుతున్నాయి. గత నెల 26 నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నట్లు వైసిపి నేతలు బస్సు యాత్ర సాక్షిగా చెబుతున్న మాటలు ప్రజల విశ్వాసం పొందడం లేదు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులపై, జంక్షన్ లలో బస్సు యాత్ర చేపడుతున్నా జనాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బలవంతపు జన సమీకరణాలు సైతం వర్కౌట్ కావడం లేదు. దీంతో ఇది ఒక విఫల ప్రయత్నంగా మారింది.
ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు వైసీపీకి దూరమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీలను చేరదీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. బీసీ గర్జనలు నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట బీసీ సాధికార యాత్ర పేరిట బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు.అయితే ఈ యాత్రలకు అధికార పార్టీ నేతలు సైతం దూరమవుతుండడం విశేషం.
చిత్తూరు లాంటి జిల్లాల్లో సైతం ఈ యాత్రలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ యాత్రలను విజయవంతంగా పూర్తి చేయాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక ప్రణాళికల రూపొందించారు. సభా ప్రాంగణాన్ని నడిరోడ్డుపై ట్రాఫిక్ మళ్లించి మరి ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రజలు ముఖం చాటేయడంతో అధికార పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సుయాత్ర ఒక మొక్కుబడి తంతుగా ముగిసింది. సొంత పార్టీ శ్రేణులకు ఆకట్టుకోలేదు.
ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర పుణ్యమా అని వైసిపిలో విభేదాలు వెలుగు చూస్తున్నాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించాలని, జిల్లా మంత్రితోపాటు కీలక నేతలు హాజరు కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలతో మంత్రులు, కీలక నేతలు హాజరు కావడం లేదు. టికెట్ల పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అయితే.. కీలక నేతల ప్రకటనలు వివాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. అటు జనం ముఖం చాటేస్తుండగా.. నేతల తీరుతో విభేదాలు బయటపడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు ఒక విఫల ప్రయోగంగా మారినట్లు సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.