YCP Govt- Police: వైసీపీ… విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను చాలావరకూ ఉపయోగించుకుంది. అధికారంలోకి వచ్చేందుకు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంది. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టింగులు పెడుతూ ప్రజాభిమానాన్ని పొందింది. సమాంతర వ్యవస్థగా సోషల్ మీడియా వింగ్ ను తయారు చేసుకుంది. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయ్యంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, పత్రికా ప్రతినిధులను ఎవరినీ వదిలిపెట్టకుండా కేసులు పెట్టారు. అధికార పార్టీ ఎంపీని సైతం అర్ధరాత్రి కుళ్లబొడిచేశారు. ఇప్పుడు పోలీసుల వంతు వచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను ఏకంగా సస్పెండ్ చేశారు. దీంతో సంఘ విద్రోహ శక్తులకు సైతం భయపడని పోలీసులు సోషల్ మీడియాకు వణికిపోతున్నారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రాంతంలో వందలాది మంది మహిళల్ని విషవాయువు ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతకుముందు ఏలూరు సమీపంలోని పరిశ్రమలో ప్రమాదం జరిగింది. రెండేళ్ల క్రితం విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ దుర్ఘటన జరిగింది. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల్ని సక్రమంగా తనిఖీ చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టు సర్క్యులేట్ అయింది.
Also Read: AP SSC Results 2022: ఏపీలో తగ్గిన పదో తరగతి ఉత్తీర్ణత శాతం.. కారణాలు అవేనా?
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నవీన్ కుమార్ శెట్టికి ఇది చేరింది. ఆయన దానిని పోలీసు గ్రూపులోకి ఫార్వర్డ్ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ వివరణ తీసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ పరిశ్రమలో అమ్మోనియం లీకైన ఘటనలో ‘అన్న వచ్చాడు.. అస్వస్థత తెచ్చాడు’ అనే క్యాప్షన్ ఉండటంతో సీఎం జగన్‌ను ఉద్దేశించిందేనన్న అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారులకు కలిగింది. ‘ముఖ్యమంత్రినే నిందిస్తూ పోస్టులు పెడతావా? ఎంత ధైర్యం నీకు’ అంటూ చీవాట్లు పెట్టారు.

జగన్‌ను కించపరిచేలా పోలీస్ గ్రూపులో పోస్టింగ్ పెట్టారని నెల్లూరు జిల్లాలో ధనుంజయ్ అనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో పోలీసులు పడుతున్న ఇబ్బందులను ఆయన తెలియజేశారు. ఏఆర్ పోలీసుల వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ రికార్డు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సీరియ్‌సగా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నెల్లూరు నాలుగో పట్టణ(దర్గా మెట్ట) పోలీసు స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోస్టింగులు ఏవో చూడకుండా పెట్టడం, ఫార్వర్డ్ చేయడం తక్షణమే మానుకోవాలంటూ సీనియర్ పోలీసు అధికారులు హితవు పలుకుతున్నారు. వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని సీఎం ఎన్నిసార్లు చెప్పినా పోలీసు శాఖలో అమలు కాలేదు. సరెండర్ లీవులు జనవరిలో ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఇవ్వలేదు. దీనిపై అసోసియేషన్లు కూడా మాట్లాడటం లేదు. ఒత్తిడితో కూడిన డ్యూటీ.. పై అధికారుల వేధింపులు.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు.. శాంతి భద్రతల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు.. సమయపాలన లేని పని భారం.. సెలవులివ్వని ఎస్‌హెచ్‌వోలు.. వీటికి తోడు కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పోలీసులకు ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా భయం పట్టుకుంది.
Also Read:BJP Alliance With Janasena: జనసేనతో పొత్తుపై బీజేపీ పీచేముడ్.. అసలు స్టాండ్ ఏంటి? ఏం చేయనుంది?
[…] Also Read:YCP Govt- Police: ఖాకీలైతే గొప్ప? పోలీసులనూ వదలన… […]