కాదేది తిట్టుకోవడానికి అనర్హం అన్నట్టుగా మారింది ఏపీలో రాజకీయం పరిస్థితి. అసలు ఈ ‘చెత్త’ రాజకీయం ఏంట్రా బాబూ అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం ‘చెత్త పన్ను’ వేస్తోందని టీడీపీ గోల చేస్తోంది. ఆఖరుకు పింఛన్ దారుల నుంచి కూడా 180 రూపాయలు చెత్త పన్ను పేరిట తీస్తోందని ఆరోపిస్తోంది. అధికార వైసీపీ ‘చెత్తపన్ను’పై టీడీపీ నిప్పులు చెరుగుతోంది.

ఏపీలో ‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమాన్ని ఏపీ పురపాలకశాఖ నెత్తిన ఎత్తుకుంది. మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రెండో దశలో అన్ని మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
క్లాప్ అమలు కోసం మున్సిపాలిటీ పాలకవర్గాలు వెంటనే సమావేశమై ఆమోదం పొందించుకోవాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికారులతో ఏజెండాను రెడీ చేస్తున్నారు. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కవిధంగా పన్ను వేయాలని కమిషనర్లు ప్రతిపాదిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ నివాసాలు, నివాసేతర నుంచి వ్యర్థాలు సేకరించి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పలు చోట్ల పురపాలక సభ్యులు సైతం వినియోగరుసుములు వసూళ్లు ప్రతిపాదించడంపై వ్యతిరేకించారు.
గృహాలకు 120 రూపాయల పన్ను ఉండగా.. మురికివాడల్లోని గృహాలకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. స్టార్ హోటళ్లకు 15వేల వరకు పన్నులు వేస్తున్నారు. దుకాణాలకు రూ.300నుంచి రూ.5వేలలోపు వేస్తున్నారు.సినిమా హాళ్ల నుంచి సూపర్ మార్కెట్ల దాకా ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ‘చెత్త’పై పన్ను వేస్తూ ఏపీ సర్కార్ భారీగానే వసూళ్లు చేస్తోంది. ఖాజానా నింపుకుంటోంది.
ఏపీ సర్కార్ చెత్తపై పన్నులు వేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ పార్టీసీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అయితే విరుచుకుపడ్డారు. ‘అవ్వ తాతలకు ఇచ్చే 2250 పింఛన్ లో 180 రూపాయలు చెత్తపన్ను మినహాయించుకొని ఇస్తున్నారని విమర్శించారు. మరి ఇది నిజమా? టీడీపీ ఆరోపణలు వాస్తవమేనా? అన్నది తేలాల్సి ఉంది.