Central Vigilance Commission Report: వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. అన్ని శాఖల్లో కల్లా కీలకమైన హోం శాఖలో పని చేస్తుంటారు. దేశ అంతర్గత భద్రత నుంచి మొదలు పెడితే సరిహద్దుల్లో జరిగే విషయాల మీద వారు నిత్యం పరిశీలన జరుపుతుంటారు. వాస్తవానికి ఇలాంటి శాఖలో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగుల్లో జవాబుదారితనం అనేది అత్యంత కీలకం. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా అది అత్యంత అవసరం కూడా. కానీ దానిని వారు విస్మరిస్తున్నారు. దేశంలోనే నంబర్ టు పవర్ హౌస్ గా ఉన్న వ్యక్తి సారధ్యం వహిస్తున్న శాఖకు మాయని మచ్చ తీసుకొస్తున్నారు. ఈ మాటలు అంటున్నది ప్రతిపక్షాలు కావు. ఇతర పార్టీలు కాదు. కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఎవరు ఏమన్నా అనుకోని చేయి తడిపితేనే పని అనే తీరుగా ఉద్యోగుల వ్యవహారం కొనసాగుతోందని సెంట్రల్ రిజర్వేషన్ కమిషన్ బాంబు పేల్చడం ప్రస్తుతం దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది.
అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి చాలా వరకు కూడా దేశానికి లాభం చేకూర్చాయి. కానీ ఇదే దశలో ఆయన ఉద్యోగులకు స్వాతంత్రం ఎక్కువగా ఇవ్వడం కట్టు తప్పేలా చేసింది. దేశసేవను మర్చిపోయిన ఉద్యోగులు చేయి చాపడం మొదలుపెట్టారు. ఫలితంగా కేంద్రంలోని అన్ని శాఖలకు ఆదర్శంగా నిలవాలిసిన హోంశాఖ అవినీతి మకిలిని అంటించుకుని.. వసూళ్ల విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జరిపిన అంతర్గత సర్వేలో కేంద్ర హోంశాఖ తీరుపై విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిపై 1.15 లక్షల అవినీతి ఫిర్యాదులు అందాయి. గత ఏడాది వచ్చిన ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులపైనే రావడం గమనార్హం. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తాజా వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన అధికారులు, ఉద్యోగుల
అవినీతికి సంబంధించి 2022లో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందినట్లు నివేదికలో తెలిపింది. వీటిలో అత్యధికంగా హోం శాఖ అధికారులపై 46,643 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో రైల్వే, బ్యాంకు ఉద్యోగులు ఉన్నట్లు వివరించింది. రైల్వే అధికారులు, ఉద్యోగులపై 10,580; బ్యాంకుల సిబ్బందిపై 8,129 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. మొత్తం 1.15 లక్షల ఫిర్యాదుల్లో 85,437 పరిష్కరించారని.. 29,766 ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. అధికారులు, ఉద్యోగుల అవినీతిపై అందిన ఫిర్యాదులను మూడు నెలల్లోపే పరిష్కరించాల్సి ఉంటుందని సీవీసీ అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ సిబ్బందిపై వచ్చిన 46,643 ఫిర్యాదుల్లో 23,919 ఫిర్యాదులను పరిష్కరించగా, 22,724 అపరిష్కృతంగా ఉన్నాయని.. మరో 19,198 ఫిర్యాదులు 3 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ నివేదిక వెల్లడించింది.