
రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది నటులు రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలుగు, తమిళ రాజకీయాల్లో ప్రముఖ నటులు సత్తా చాటారు. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఈ మధ్య కాలంలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నా కొందరు రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ కాలేకపోతున్నారు.
Also Read : విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సారీ
నటులుగా వారిపై అభిమానం ఉన్నా ఆ అభిమానం ఓటుగా మారడం లేదు. అయితే ఎంతోకాలం నుంచి తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ ఎంట్రీ ఉంటుందని వార్తలు రాగా తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు రజనీకాంత్ నవంబర్ లో కొత్త పార్టీని పెట్టబోతున్నాడని తెలుస్తోంది. పార్టీ పెట్టిన తరువాత ఎక్కడినుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తాననే విషయం తెలుసుకోవడానికి రజనీకాంత్ సర్వేలు కూడా చేయించాడని సమాచారం.
2021 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత మృతి తరువాత తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం, అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలపై ప్రజలకు విశ్వాసం తగ్గడంతో రజనీకాంత్ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు చెబుతున్నారు. రజనీ నవంబర్ లో పార్టీ పేరును, లక్ష్యాలను ప్రకటించబోతున్నాడని తెలుస్తోంది.
తిరువణ్ణామలై, మదురై, వేలూరు, షోళింగర్ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రజనీ పోటీ చేసే అవకాశం ఉందని… ఈ నాలుగు నియోజకవర్గాల్లో రజనీకాంత్ కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. మొదట రజనీ రెండు ప్రాంతాల్లో మహానాడు జరిపి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో రజనీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా…? లేక ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగుతుందా…? అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read : ఆగం అవుతున్న ఫ్యాన్స్.. మెగాస్టార్ కు పట్టదా?