India-America friendship: భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా తాజాగా 50 శాతం సుంకాలు విధించింది. మొదట 25 శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ తర్వాత రష్యానుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుందన్న సాకుతో మరో 25 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత ఎగుమతులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. అయితే భారత్‌తో అమెరికా సంబంధాలు చరిత్రలో ఎన్నో ఒడిదొడుకులను చూశాయి. ప్రజాస్వామ్య బంధం సహజంగా బలపడాల్సినప్పటికీ, అమెరికా ఆధిపత్య ధోరణి, వాణిజ్య ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయ వ్యూహాలు తరచూ అడ్డుగా నిలిచాయి. 1990లలో క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతికతను రష్యా నుంచి సమకూర్చుకోవడానికి భారత్ చేసిన ప్రయత్నాలను అమెరికా అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనం. తమ వాణిజ్య ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుందని భావించిన అమెరికా, రష్యాపై ఒత్తిడి చేసి ఒప్పందాన్ని రద్దు చేయించింది. ఫలితంగా, భారత్ స్వయంశక్తితో క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి రెండు దశాబ్దాలు శ్రమించాల్సి వచ్చింది.
ఇప్పుడు అమెరికాకే సహకారం..
2025 ఆగస్టు 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహం భారత్–అమెరికా సహకారానికి నిదర్శనం. ఈ ఉపగ్రహం, జీఎస్‌ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా కక్ష్యలోకి చేరింది. అయితే ఇది ఒకప్పుడు వివాదానికి కారణమైన క్రయోజెనిక్ ఇంజిన్‌తోనే సాధ్యమైంది. ఈ ఘట్టం రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారం, ఉమ్మడి లక్ష్యాలను సాధించే దిశగా ఒక అడుగును సూచిస్తుంది. అయితే, ఈ సహకారం గతంలో అమెరికా విధించిన ఆంక్షలను మరచిపోనివ్వదు. ఈ ఉపగ్రహం ఒకవైపు స్నేహానికి చిహ్నంగా నిలిచినప్పటికీ, భారత్ స్వదేశీ సామర్థ్యాన్ని గుర్తుచేస్తుంది.
అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని..
1998లో భారత అణుపరీక్షల తర్వాత అమెరికా విధించిన ఆంక్షలు భారత సాంకేతిక ప్రగతికి తీవ్ర సవాళ్లను తెచ్చాయి. తేజస్ యుద్ధవిమాన ప్రాజెక్టు ఈ ఆంక్షల వల్ల ఆలస్యమైంది. అమెరికా సంస్థల నుంచి భారత శాస్త్రవేత్తలను బహిష్కరించడం, సాంకేతిక సహకారాన్ని నిలిపివేయడం వంటి చర్యలు భారత్‌ను తాత్కాలికంగా కుంగదీశాయి. అయినప్పటికీ, ఈ సవాళ్లు భారత శాస్త్రవేత్తలను స్వావలంబన దిశగా నడిపించాయి. తేజస్ విమానంలో స్వదేశీ ఆవిష్కరణలతో అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయడం, క్రయోజెనిక్ ఇంజిన్‌ను సొంతంగా తయారు చేయడం వంటివి ఈ స్వయంశక్తి ఫలితాలు. ఈ అనుభవాలు భారత్‌కు ఒక కీలక పాఠాన్ని నేర్పాయి.
సుంకాల సవాల్…
ప్రస్తుతం అమెరికా విధిస్తున్న సుంకాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలను సవాలు చేస్తున్నాయి. ఈ సుంకాలు భారత ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయితే, చరిత్ర ఆధారంగా చూస్తే, ఈ సవాళ్లు భారత్‌కు కొత్తవి కావు. గతంలో ఆంక్షలను ఎదుర్కొన్న విధంగానే, స్వదేశీ ఆవిష్కరణలు, స్వావలంబన వ్యూహాలతో ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. భారత్ యొక్క ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు ఈ సవాళ్లను అవకాశాలుగా మలచగలవని చరిత్ర నిరూపించింది.