BRS MLAs Secret Meeting: తెలంగాణలో ఇన్నాళ్లూ.. ఎలాంటి అసమ్మతి.. అంతర్గత కుమ్ములాటలు.. తిరుగుబాటు లేకుండా అందంగా కనిపించిన గులాబీ పార్టీలో ముళ్లు రాటుదేలుతున్నాయి. అందమైన గులాబీ పుష్ఫం మాటున ముళ్లు దాగిఉన్నట్లే.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లూ కనిపించని ముళ్లు ఇప్పుడు పదునెక్కుతున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించడం బీఆర్‌ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇక ఈ సీన్ అనేక జిల్లాలలో రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రాష్ట్రమంతా అసమ్మతి విస్తరిస్తే ఎలా అన్న టెన్షన్ ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులో నెలకొంది.

మేడ్చల్‌లో అసమ్మతి రాగం..
మంత్రి మల్లారెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పదవులను తన నియోజకవర్గ నాయకులకు కట్టబెడుతున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ వద్దని తేల్చుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల మాటలను బేఖాతరు చేస్తూ మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు తాము మంత్రి కారణంగా న్యాయం చేయలేక పోతున్నామని వాపోయారు. బీఆర్‌ఎస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోనూ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పలు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత
తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మంత్రుల తీరుపై ఇదే తరహా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంత్రులు ఆధిపత్యాన్ని చలాయించడంలో భాగంగా స్థానికంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల తరహాలో తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై స్థానిక నేతల్లో వ్యతిరేకత ఉందది. నల్లగొండ జిల్లాలో జగదీశ్‌రెడ్డితో నేతలకు పొసగడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రీనివాస్‌గౌడ్ తీరు స్థానిక నేతలకు నచ్చడం లేదు. వరంగల్ జిల్లాలో మంత్రి సత్యవతిరాథోడ, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌పై మాజీ మేయర్ రవీందర్‌సింగ్ అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. మంత్రి శాఖలోనే పదవి ఇవ్వడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి కీలక నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పాత, కొత్త నాయకుల కలయికతో బీఆర్‌ఎస్ పార్టీలో పదవుల కోసం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అంతర్గత యుద్ధం కొనసాగుతుంది.
పట్టు కోసం మంత్రుల వ్యూహం..
ఇక మంత్రులు జిల్లాపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తూ తమ అనుయాయులకు మాత్రమే నామినేటెడ్ పదవులను ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. దీనిని ఎమ్మెల్యేలు ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అనేక సందర్భాల్లోల మంత్రుల తీరుపై బాహాటంగానే అసహనాన్ని వెళ్లగక్కిన, విమర్శలు గుప్పించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మంత్రుల కార్యక్రమాలకు సైతం గైర్హాజరు అయిన పరిస్థితి ఉంది. ఇక ఈ క్రమంలో ఒక్కసారిగా మేడ్చల ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో భేటీ అయిన ఘటన ఒక్కసారిగా బీఆర్‌ఎ‹ ను ఉలిక్కిపడేలా చేసింది.

దృష్టి సారించిన గులాబీ బాస్..
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రధానంగా ఈ పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యను పరిష్కరించడం కోసం మాట్లాడుతున్నారు. అయితే మళ్లీ జిల్లాలకు వచ్చిన తర్వాత మాత్రం పార్టీ నేతల మధ్య సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఒకరికి ఒకరికి మధ్య సఖ్యత లేని తీరు ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేతను టెన్షన్ పెడుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వెళుతున్న వేళ, రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న అంతర్గత కలహాలు బీఆర్‌ఎస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏది ఏమైనా మేడ్చల్ జిల్లా సీన్ రాష్ట్రవ్యాప్తంగా రిపీట్ కాకుండా ఉండడానికి గులాబీబాస్ ఏం చేస్తారు అన్నది మాత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది.