Baba Siddikhi murder case : నవరాత్రుల సందర్భంగా శనివారం తన కుమారుడి కార్యాలయం ఎదుట టపాకులు కాల్చుతుండగా.. సిద్ధిఖి ని హర్యానా రాష్ట్రానికి చెందిన గురుమైల్ బల్జిత్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ అనే యువకులు దారుణంగా కాల్చారు. ఈ ఘటనలో సిద్ధిఖి తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిఖి మహారాష్ట్రలోని ముంబైలో ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయానికి సంబంధించి వ్యాపారంలో విభేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో అనేక రకాలుగా అవకతవకలు జరగడంతో ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతుంది. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తులు సిద్ధిఖి నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కాపులకు పాల్పడిన వ్యక్తులకు ముందుగానే నగదు చెల్లింపులు జరిపినట్టు తెలుస్తోంది. వారు కాల్పులు జరపడానికి ఆయుధాలు పార్సిల్ లో వచ్చాయని సమాచారం. కాల్పులకు పాల్పడిన వ్యక్తుల్లో ఓ నిందితుడు పరారీలో ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా సహకరించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బాగానే ఆ పోలీసులకు విభాగం ముంబై చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఏమిటీ కుంభకోణం
బాబా సిద్ధిఖిది గా చెబుతున్న 462 కోట్ల ఆస్తులను 2018లో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్ధిఖి 2000 నుంచి 2004 సంవత్సరం వరకు మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కొనసాగారు. అప్పుడు మురికివాడల పునరావాస ప్రాజెక్టు చేపట్టారు. అయితే ఇందులో 2000 కోట్ల అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. 2012లో ఈ వ్యవహారంపై అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2014లో సిద్ధిఖి తో పాటు 15 మందిపై కేసు నమోదయింది. ఇళ్ల కేటాయింపుకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో..
సిద్ధిఖి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1977లో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరారు. 1980 నాటికి బాంద్రా తాలూకాలో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు.. బాలీవుడ్ నటుడు సునీల్ దత్ కు అత్యంత సన్నిహితుల్లో సిద్ధిఖి ఒకరంటే.. ఆయన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1999 లో తొలిసారిగా బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మహారాష్ట్రలోని కార్మిక, ఫుడ్, సివిల్ సప్లై, ఎఫ్ డీఏ శాఖలకు సిద్ధిఖి మంత్రిగా పనిచేశారు. బాలీవుడ్ నటిమణులతో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించేవారు. కొంతమంది హీరోయిన్లు ఈయన ఇంటికి తరచుగా వచ్చేవారు. పార్టీలు కూడా జరిపేవారు. అకస్మాత్తుగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ లో చేరి సిద్ధిఖి సంచలనం సృష్టించారు. కాగా, సిద్ధిఖి రంజాన్ సమయంలో భారీగా ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతుంటారు. సల్మాన్ ఖాన్ ఈ విందుకు ఖచ్చితంగా వస్తుంటారు. అయితే గతంలో ఓసారి ఇఫ్తార్ విందుకు సల్మాన్ – షారుక్ ఖాన్ ను ఆహ్వానించిన సిద్ధిఖి.. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ముగిసేలా.. మధ్యవర్తిత్వం నడిపారని అప్పట్లో ప్రచారం జరిగింది.