Homeజాతీయ వార్తలుఈ బినామీల వల్లే అసలు సమస్యలు

ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

bhuma akhila priya av subba reddy
భూ వివాదాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరూ ఊహించలేం. కొట్టుకోవడాలు.. చంపుకోవడాలు చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. ఏకంగా కిడ్నాప్‌లకూ వెనకాడరు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారమే తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారం ఆసక్తికరంగానూ వివాదస్పదంగానూ మారింది.రెండు వైపులా స్పందనలు చూసిన తర్వాత అదో భూవివాదం అని.. అది కూడా చిన్న మొత్తం కాదన్న విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం అయిన హాఫీజ్ పేటలో దాదాపుగా పాతిక ఎకరాలకు సంబంధించిన వివాదమిది. ఆ భూమి విలువ వెయ్యి కోట్ల పైమాటే. దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మారిస్తే.. రూ.రెండు మూడు వేల కోట్ల వరకు వస్తుంది. అంత ఖరీదైన ప్రాపర్టీ కోసమే ఇప్పుడు ఈ కిడ్నాపుల వ్యవహారమంతా జరుగుతోంది.

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్..?

భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆళ్లగడ్డ నేపథ్యం ఫ్యాక్షన్ లీడర్ ఇమేజ్ కలిపి సెటిల్మెంట్ కింగ్‌గా మార్చాయి. ఆ సెటిల్మెంట్లలో కీలకంగా వ్యవహరించేది ఆయన కుడిభజం ఏవీ సుబ్బారెడ్డి. సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు.. వ్యాపారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచేవి. అలా నిర్వహించిన వాటిలో చేతికి అందిందే ఈ హాఫీజ్ పేట భూమి. కానీ.. అది భూమా పేరు మీద లేదు. బినామీల పేరు మీదనే ఉంది. ఆయన హఠాత్తుగా చనిపోవడంతోనే అసలు సమస్య వచ్చింది. ఓ వైపు ఏవీ సుబ్బారెడ్డి ఎదురు తిరగడం.. మరో వైపు ఆ భూమి విషయంలో సీఎం కేసీఆర్ బంధువులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. ప్రవీణ్ రావు వర్గీయులు కూడా ఆ భూమి తమదేనని.. తమ పేరుపై ఉందని తామే కొనుగోలు చేశామని స్పష్టంగా చెప్పడం లేదు. ఆ భూవివాదంలో భూమా కుటుంబంతో గొడవలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు.

అయితే.. రాజకీయాల్లో బినామీలు కామన్‌. అందులోనూ భూముల వ్యవహారంలో ఇది మరీ ఎక్కువ. వారి దగ్గరి అనుచరుల ద్వారా వ్యవహారాలు చక్క బెడతారు. ఎక్కువగా రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు ఈ దందాకు ప్రాధాన్యం ఇస్తారు. బెదిరించి తక్కువకు కొనుగోలు చేయడం లేదా.. సెటిల్మెంట్ చేసి కొంత పోగేయడం వంటి వాటి ద్వారా వాటిని వెనకేసుకుంటారు. ఆ సెటిల్మెంట్ కింగ్ హవా ఉన్నంత వరకూ బాగానే ఉన్నా.. తర్వాత పరిస్థితి మారిపోతుంటుంది. వేరే వారికి అధికారం చిక్కిన తర్వాత వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు. అలాంటి భూముల్ని నయానో.. భయానో సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు హాఫిజ్ పేట భూముల పరిస్థితి అదేనని స్పష్టంగా తెలుస్తోంది.

Also Read: ఓడగొట్టారని హైదరాబాదీలకు వరదసాయం ఇవ్వవా కేసిఆర్ సార్?

అందుకే.. ఆ వేల కోట్ల విలువైన భూమిని దక్కించుకునేందుకు ఇరు వైపులా వర్గాలు ఛాలెంజ్‌తో ఉన్నాయి. వేలాది కోట్లు కాబట్టి అంత ఈజీగా వదులుకునేందుకు ఏ వర్గం కూడా మెట్టు దిగడం లేదు. ఎంత సీఎం కేసీఆర్ బంధువులకైనా ప్రాణ భయం ఉంటుంది. కిడ్నాప్ అయిన వారు.. తమకు రక్షణ ఉంటుందని ఇక ముందు ఎలా అనుకోగలరు. ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. నిన్న వారి వైపు వ్యక్తులు చూపించిన స్పందన అదే. వివాదాన్ని పరిష్కరించుకుంటామన్నట్లుగా మాట్లాడారు.

అసలు సమస్య మాత్రం ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదు. రాజకీయ నేతలకు ఈ బినామీల గోల ఏంటని ఎవరూ ఆలోచించడం లేదు. బినామీల గుట్టు తేల్చాలని అధికారంలో ఉన్న ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరికీ నల్లమచ్చలుంటాయి. అవి అన్ని పార్టీల నేతలతో పెన వేసుకుపోయి ఉంటాయి. ఒకరి గుట్టు తేల్చాలనుకుంటే.. అందరివీ బయటకు వస్తాయి. అందుకే.. ఎవరూ ఎవరి జోలికిపోరు. ఈ వివాదం కూడా రేపో మాపో పెట్టీ కేసుగా మారిపోతుంది. రచ్చ అయింది కాబట్టి ఇప్పుడు రాజీకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version