https://oktelugu.com/

Tomato Price: టమాటా కష్టాలు: రైతులు అమ్మ బోతే అడవి.. వినియోగదారులు కొనబోతే కొరివి.. ఎందుకీ వ్యత్యాసం?

టమాటా.. మూడు అక్షరాలు ఉన్న ఈ కూరగాయ లేనిది ఏ వంట వండరు. అందుకే మనదేశంలో అత్యధిక వినియోగం ఉన్న కూరగాయలలో టమాటా మొదటి స్థానంలో ఉంటుంది. దీని ఆధారంగా ప్రతిరోజు కోట్లల్లో లావాదేవీలు నడుస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ వరకు టమాటా విస్తారంగా పండుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 10, 2024 / 08:24 AM IST

    Tomato Price

    Follow us on

    Tomato Price: దేశ రాజకీయాలను శాసించిన చరిత్ర టమాటాది. దీని ధర ఒక్కోసారి బంగారాన్ని మించిపోతుంది. ఆ సమయంలో పంటను కాపాడుకునేందుకు.. కాపలా ఉంచుకునేందుకు రైతులు ఏకంగా సెక్యూరిటీ ని నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఆధార్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ చేసినట్టు.. టమాటాలను విక్రయించాల్సి ఉంటుంది.. గత ఏడాది కిలో టమాటా ఏకంగా 200 మార్క్ దాటింది. సరిగ్గా మే నుంచి ఆగస్టు వరకు ఈ పరిస్థితి ఉంది. ఆ సమయంలో రైతుల వద్ద పంట అంతంత మాత్రమే ఉంటుంది. దీంతో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ధర అమాంతం పెంచుతారు. అందువల్ల టమాటాలు చుక్కల్లో విహరిస్తుంటాయి.

    రూపాయికి పడిపోయింది

    ప్రస్తుతం టమాటా ధర కిలో రూపాయికి పడిపోయింది. మొన్నటివరకు ఈ పంట ద్వారా రైతులు లాభాలను కళ్ల చూశారు. కానీ ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టమాట పంటకు పేరు పొందిన ప్రాంతాలుగా పత్తికొండ, మదనపల్లి లో కిలో టమాటా ధర రూపాయికి పడిపోయింది. గిట్టుబాటు ధర లేక రైతులు తాము పండించిన టమాటాలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. టమాటాలను కోసేందుకు వచ్చిన కూలీలకు కూడా ఆ ధర సరిపోకపోవడంతో.. రవాణా ఖర్చులు, ఇవన్నీ మిగిలే అవకాశం లేకపోవడంతో పండిన పంటను రోడ్ల పక్కన పడేస్తున్నారు..” మా దగ్గర పంట లేనప్పుడు ధర రాకెట్ లాగా పెరుగుతుంది. మా దగ్గర పంట ఉన్నప్పుడు ధర నేల చూపులు చూస్తుంది. అందువల్లే ఈ పంటను అమ్మడం కంటే.. ఇలా రోడ్ల పక్కన పారబోయడం నయం. కనీసం వాటినైనా పశువులు తింటాయని” రైతులు వాపోతున్నారు.

    హైదరాబాదులో కిలో 40 రూపాయలు

    ఇతర ప్రాంతాలలో కిలో రూపాయి పలుకుతున్న టమాటా.. హైదరాబాదు లాంటి ఏరియాలలో కిలో 30 నుంచి 40 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ – నవంబర్, డిసెంబర్ తొలి వారంలో టమాటా కిలో 70 రూపాయల వరకు చేరుకుంది. డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఏపీలో రూపాయి మాత్రమే పలుకుతున్న టమాటా.. హైదరాబాదు లాంటి ప్రాంతాలకు వచ్చేసరికి 400 రెట్లు పెరగడం విశేషం. అయితే మధ్యలో వ్యాపారులు రవాణా ఖర్చులని, ఇతర ఖర్చులని చెప్పి ధరలను అమాంతం పెంచుతున్నారు. పండించిన రైతులు నష్టపోతుంటే.. వారు మాత్రం కోట్లను గడిస్తున్నారు. ఆరుగాలం పంట పండించిన రైతులకు మాత్రం అప్పులను, పుట్టెడు కష్టాలను మిగుల్చుతున్నారు.