Land Regularization Scheme: మొన్ననే కదా ఎమ్మెల్యేల అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉందని, పద్ధతి మార్చుకొని వారి కత్తిరిస్తానని కెసిఆర్ హెచ్చరించింది.. అలా అని రెండు రోజులు గడిచాయో లేదో.. యూటర్న్ తీసుకున్నాడు.. అంతేకాదు ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాలకు ” భూ” మంత రాజులను చేశాడు.. ఆ దిశగా కెసిఆర్ తీసుకున్న నిర్ణయం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వాటిని చక్కదిద్దాల్సింది పోయి వారికే సర్వాధికారాలు కట్టబెట్టేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో ఎందుకు తలనొప్పి అని కెసిఆర్ ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలకే ప్రయోజనం
గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59 ను తెరపైకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదలకు క్రమబద్ధీకరిస్తారు. వాస్తవంగా ఈ పని చేయాల్సింది అధికారులు. అయితే కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన ఈ జీవోలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తర్వాత హడావుడి మొదలుపెట్టింది.. అంటే సర్కారు తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేది. అధికారులు చేయాల్సిన పనిని ఎమ్మెల్యేల చేతిలో పెడుతోంది. జీవో 58, 59 కింద వచ్చే దరఖాస్తులను పరిష్కరించే అధికారం అధికార ఎమ్మెల్యేదేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. అంతేకాదు నోటరీకి సంబంధించిన భూముల విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేలను కలవాలని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం.. మరోవైపు క్రమబద్ధీకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలను కలిసి పరిష్కరించుకోవాలని, అనంతరం నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి న్యాయపరమైన హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణను రాజకీయ పట్టు కోసం ప్రభుత్వం ఎమ్మెల్యేల చేతుల్లోకి తీసుకెళ్తుందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నది.
ఎందుకు ఈ నిర్ణయం
ప్రభుత్వం బయటికి చెప్పడం లేదు గాని అధికార పార్టీకి చెందిన ప్రభుత్వం బయటికి చెప్పడం లేదు కానీ అధికార పార్టీకి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయితే వీరితో ఎన్నికల ముందు ఎందుకు తలనొప్పి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఇతరత్రా ప్రయోజనాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే పారదర్శకంగా చేయాల్సిన పనిని ప్రభుత్వం ఓట్ల రాజకీయంతో ముడి పెట్టడం అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడం అత్యంత సంక్లిష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తనకున్న అన్ని మార్గాలను వాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నదనే చర్చ కూడా నడుస్తోంది.
ఇంత ప్లాన్ ఉందా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో కొంత భాగంలో స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 58,59 కింద చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కూడా ఎమ్మెల్యేలను కలవాల్సిందే. వాస్తవానికి దళిత బంధు విషయంలో అవినీతి చేరడంతో లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పాత్రను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల రాజకీయం కోసం స్థలాల క్రమబద్ధీకరణను అదే ఎమ్మెల్యేలతో ముడిపెట్టింది. దీంతో ఏ పార్టీకి చెందిన దరఖాస్తుదారుడైనా ఎమ్మెల్యేను కలవాల్సి ఉంటుంది. మొత్తంగా స్థలాల క్రమబద్ధీకరణను కెసిఆర్ ఓట్ల క్రమబద్ధీకరణ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే రాజకీయ మద్దతు అడుగుతారా, ఆర్థిక మద్దతు అడుగుతారా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి జీవో 58, 59 దరఖాస్తుల గడువు ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ గడువును ప్రభుత్వం మరో నెలపాటు పెంచింది.
నోటరీ ఆస్తుల విషయంలోనూ..
జీవో 58,59 మాత్రమే కాకుండా నోటరీ ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది. జీవో నెంబర్ 58,59 కింద దరఖాస్తు చేసుకున్న వారు, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణకు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందన్న భరోసా కనిపించడం లేదు. అధికార పార్టీ చెందిన ఓటర్లు, కార్యకర్తలకు పక్కాగా ప్రయోజనం దక్కేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. వీరు మాత్రమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకులు, తటస్థంగా ఉండేవారి పరిస్థితి ఇప్పుడు ఏమిటనేది అంతు పట్టకుండా ఉంది. వీరు ఎమ్మెల్యేను కలవకుంటే అంతే సంగతులా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు రాజకీయంగా తమకు మద్దతు ఇస్తేనే ఈ సమస్యను పరిష్కరిస్తామనే లోపాయికారీ ఒత్తిళ్లు కూడా తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. అధికార యంత్రాంగం చేయాల్సిన పనిని ఎమ్మెల్యేలతో ముడి పెట్టడం అంటే పారదర్శకతకు పాతర వేసి, అధికార పార్టీ జాతరగా మార్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.. అర్హులైన వారికి స్థలాల క్రమబద్ధీకరణ జరగాలని, ఎమ్మెల్యేలను కలిసి వారి ద్వారా సిఫారసు చేయించుకుంటేనే అనే పరిస్థితికి ప్రభుత్వం మాటలు తీసుకెళ్తాయని అంటున్నారు. అంతేకాదు సిఫారసులంటేనే ఇక వాటి వెనుక ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుదారులు “మీసేవ” నుంచి చేసుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత అధికారులకు, దరఖాస్తుదారునికి మాత్రమే తెలుసు. స్థానిక ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆ వివరాలు ఎమ్మెల్యేల ముందు పెట్టాల్సి ఉంటుంది. అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The power to dispose of the applications under g o 58 59 lies with the incumbent mla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com