Government Teacher Krishna: ఏపీలో అధికార పార్టీ దాష్టీకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న అక్కను వేధించవద్దని కోరినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై యాసిడ్ పోసి చంపాడు ఓ నాయకుడు. అది మరువక ముందే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాడని ఓ ఉపాధ్యాయుడినే దారుణంగా హతమార్చారు అధికార వైసీపీ నాయకులు. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి కూతవేటు దూరంలో జరిగింది ఈ ఘటన. పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయుడ్ని వెంటాడి వేటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా కనికరించలేదు. కర్కశంగా కళ్లు పొడిచి మరీ చంపేశారు.
తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ (58) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాజాం పట్టణంలోని గాంధీనగర్ లో నివాసముంటున్నారు. తెర్లాం మండలం కాలంరాజుపేట పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఇంటి నుంచి బైక్ పై బయలుదేరారు. అప్పటికే మాటువేసిన ఆగంతకులు బొలేరా వాహనంతో ఢీకొట్టారు. బైక్ తో పాటే 100 మీటర్ల మేర ఈడ్చుకుపోయారు. తరువాత ఇనుప రాడ్డులతో దారుణంగా కొట్టి చంపారు. కృష్ణ వద్దని కోరినా వారు కనికరించలేదు. చంపి రోడ్డుపక్కనే పడేసి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు పాల్పడింది మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలుగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీలో క్రియాశీకంగా ఉండే కృష్ణ 1988 నుంచి 1995 వరకూ ఉద్దవోలు సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1998 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అవకాశం రావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయితే అప్పటి నుంచి కృష్ణ మద్దతు తెలిపిన వారే సర్పంచ్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇది ప్రత్యర్థి వర్గానికి మింగుడు పడడం లేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో సైతం కృష్ణ మద్దతుదారే సర్పంచ్ గా గెలుపొందారు. గ్రామాభివృద్ధి దృష్ట్యా సర్పంచ్ ను కృష్ణ వైసీపీలో చేర్పించారు.
అయితే అప్పటికే వైసీపీ నాయకులుగా ఉన్న మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలకు చెక్ పడింది. వారు నిబంధనలకు విరుద్ధంగా చెరువు గర్భంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం నిర్మించడంతో గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో డీఎస్సీ నియామకాల్లో కృష్ణ అక్రమంగా ఉపాధ్యాయ పోస్టు పొందినట్టు ప్రత్యర్థి వర్గం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదాలు, కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణ హత్యకు ప్రత్యర్థులు వ్యూహరచన చేశారు. పైశాచికంగా చంపేశారు. ఈ ఘటన రాష్ట్రంలో ఉన్న శాంతిభద్రతలను తెలియజేస్తోందని.. వైసీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.