YCP- TDP: వచ్చే ఎన్నికల్లో జనం నాడి ఎలా ఉంటుంది? అసలు జనం ఏం కోరుకుంటున్నారు? తమ పాలనను దీవిస్తారా? లేకుంటే వైఫల్యాలను గుర్తించి పక్కనపెడతారా? తాము అందిస్తున్న సంక్షేమానికి సంతృప్తి చెందుతున్నారా? లేదా? ఏపీలో అధికార వైసీపీని కలవరపరుస్తున్న అంశం ఇది. గత ఎన్నికల్లో నవరత్నాలు ప్రకటించి జగన్ భారీగా లబ్ధిపొందారు. అన్నివర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొని సంపూర్ణ విజయం సాధించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. అప్పులు చేయడం.. పథకాల పేరిట పంచడం అలవాటు చేసుకున్నారు. అభివృద్ధిని పూర్తిగా పక్కనపడేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అప్పులుచేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా చేశారని ముప్పేట విమర్శలనైతే ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయంపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ నినాదంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు భారీగా సంక్షేమ పథకాలు అమలుచేశామన్న నమ్మకం వైసీపీలో కనిపిస్తోంది. విపక్షాలు, మీడియా గగ్గోలు పెడుతున్నా అందిన దగ్గర అప్పులు చేసి మరీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అదే తమల్ని బయటపడేస్తుందని జగన్ తో పాటు వైసీపీ నేతలు సైతం ఆశలు పెట్టకున్నారు. అదే వ్యూహంతో ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన వర్కుషాపులో కూడా నిపుణులచే ఎమ్మెల్యేలకు సంక్షేమ ప్రచారంపైనే అవగాహన కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా సంక్షేమాన్ని బూచీగా చూపి తిప్పికొట్టాలని సూచించారు.

మాస్టర్ ప్లాన్ తో వైసీపీ..
విపక్షలు కూటమి కట్టే దిశలో ఉండడంతో వైసీపీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రధానంగా మహిళల ఓట్లు కొల్లగొట్టాటని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 55 శాతం మంది మహిళలు మాత్రం క్లీయర్ కట్ గా సంక్షేమం చాలనుకుంటున్నారని తేలింది. పురుషుల విషయానికి వస్తే సంక్షేమం పేరిట దుబారా చేస్తుండడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. కానీ ఇంతవరకూ ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోలేదు. సర్వేలో ఇదే తేలడంతో సంక్షేమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో వ్యతిరేక భావన రాకుండా చూసుకోవాలని జగన్ సర్కారు యోచిస్తోంది.
Also Read: YCP MPs: సగం మందికిపైగా ఎంపీలకు నో చాన్స్.. వైసీపీలో ఏం జరుగుతోంది?
అమ్మఒడి, నేతన్న హస్తం, రైతుభరోసా, విద్యాదీవెన వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయానికి వచ్చింది. గతంలో ఎవరైనా అమలుచేశారా? అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తోంది. తద్వారా ప్రజలు చేజారకుండా చూడాలని వైసీపీ సర్కారు మాస్టర్ ప్లాన్ వేసింది. సంక్షేమమే అజెండాగా ముందుకెళ్లాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. అయితే ఎక్కడా అభివృద్ధి అన్న మాట బయటకు రాకుండా చూడాలని మాత్రం భావిస్తోంది. అభివృద్ధి అనే మాటకానీ వస్తే ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

వ్యూహంతో విపక్షాలు…
అయితే ఈ పరిస్థితులను గమనించి టీడీపీ, జనసేనలు మాత్రం అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తెరపైకి తేవడం ద్వారా వైసీపీని దెబ్బతీయ్యాలని భావిస్తున్నాయి. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వెనుకబాటు, రుణాంధ్రప్రదేశ్ వంటి వాటి ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని బయటపెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఒక వర్గం ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన కల్పించడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. ప్రధానంగా విద్యావంతులు, రాష్ట్రంపై అవగాహన ఉన్నవారు మాత్రం వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా తీర్పునివ్వాలని నిర్ణయానికి వచ్చారు. కానీ కింది స్థాయిలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారిలో మాత్రం ఒకరకమైన భావన ఉంది. ఎవరు ఎటుపోతే మాకేంటి మా అవసరానికి డబ్బులు పంచుతున్నారా? లేదా? అనేది ఆలోచిస్తున్నారు. అయితే వారిలో ఆలోచనలో సైతం మార్పు చేసేలా విపక్షాలు ప్రచారం చేస్తే మాత్రం వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షం సంక్షేమం, విపక్షాలు అభివృద్ధి తారకమంత్రాన్ని పఠిస్తున్నాయి. అందుకు తగ్గట్టు ప్రజలు కూడా విడిపోయారు. కొందరు సంక్షేమానికి దాసోహం కాగా.. మరికొందరు అభివృద్ధి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య కుంపటి పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పార్టీలు భావిస్తున్నాయి. ఈ యద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరీ.
Also Read:Black Tiger : నల్ల పులి.. దేశంలోనే అరుదైనది.. చూసే దమ్ముందా? వైరల్ వీడియో
[…] Also Read: YCP- TDP: వైసీపీ సంక్షేమం వైపా.. టీడీపీ అభివ… […]