Karnataka : దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగి దశాబ్దానికి పైగా అవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఇక అప్పటి నుంచి అంతటి ఉద్యమం ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా వినిపించలేదు కూడా. జమ్మూకశ్మీర్‌కు సైతం ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని ఉన్నా అక్కడ అంతటి స్థాయి ఉద్యమం జరగలేదు. అయితే.. రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూకశ్మీర్‌కు మళ్లీ ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. కానీ.. ఇప్పుడు కర్నాటకలో కొండ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం పురుడుపోసుకోవడం కలకలం రేపింది. కన్నడ నాట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాదాపు మూడు దశాబ్దాల తరువాత ప్రారంభం కావడం గమనార్హం.
రాష్ట్రంలోని పశ్చిమ కనుమల జిల్లాల రైతులు ఈ మేరకు సాగర్‌లో నిరవధిక నిరసనను ప్రారంభిస్తామని చెప్పారు. 1996-97లో చివరిసారిగా ఇలాంటి ఆందోళనలు జరగ్గా.. ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. డ్యాముల నిర్మాణం వల్ల తమ జీవనోపాధి పోతున్నదని, నిర్వాసితులం అవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడు దశాబ్దాలుగా తమకు ఇలానే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు షరావతి, భద్ర, సవేహక్లు, చక్ర వారాహిలు ఇప్పుడు రాష్ట్రమంతటా వెలుగులు పంచుతుంటే.. మల్నాడు ప్రాంతంలోని ప్రజల బతుకుల్లో మాత్రం చీకటికి కారణం అయ్యాయి. ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ప్రజలు తమతమ ఇళ్లను పూర్తిగా కోల్పోయారు. భూములు కూడా కోల్పోయి నిర్వాసితులయ్యారు. అయితే.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి పరిహారం లేదా పునరావాసం లభించలేదు. సొంత కష్టంతోనే ఆయా ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వారు నివసిస్తున్న ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం అటవీ భూమిగా ప్రకటించింది. దీంతో మరో నిర్వాసితులు అవుతున్నారని ఆందోళనకు దిగారు. ఒకే ప్రజలు రెండు సార్లు నిర్వాసితులు కావడంపై ఫైర్ అవుతున్నారు. ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్న టీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొండ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు వీధిన పడుతున్నారని అన్నారు. తాము దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నాడు. ఆరు దశాబ్దాలుగా ఇక్కడి రైతులు అణచివేతను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. ఇప్పటికైనా తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రత్యేక కేసుగా పరిగణించి భూ హక్కులు మంజూరు చేయాలని 14 డిమాండ్లను రైతులు ప్రభుత్వం ముందు పెట్టారు. కొండ ప్రాంతంలో నివసించే వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ఇదే చివరి యుద్ధం అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడి ప్రభుత్వం వీరి డిమాండుపై ఎలా స్పందిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.