Trap On AP Assigned Lands: అమరావతి రాజధాని అసైన్ట్ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణ తన బంధువులచే 11090 ఎకరాల అసైన్డ్ భూములు కొనిపించారన్న ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగింది. కీలక ఆధారాలు సేకరించింది. అమరావతి రైతులు మహా పాదయాత్ర 2.0 ఊపందుకుంటున్న తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిగా నిర్ణయం వెనుక టీడీపీ నాయకుల అవినీతి ఉందని.. పెద్దఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ వస్తోంది.అటు చంద్రబాబుపైనా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇంతవరకూ నిరూపించలేకపోయారు.

నారాయణే టార్గెట్
చంద్రబాబు కంటే నాటి పురపాలక శాఖ మంత్రి, రాజధాని భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నారాయణనే వైసీపీ సర్కారు టార్గెట్ చేసింది. అందుకే ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారన్న టాక్ నడిచింది. వైసీపీ సర్కారుకు భయపడ్డారన్న ప్రచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కుటుంబసభ్యులు దళితులకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ప్రసాదకుమార్ అనే వ్యక్తి 2020లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీకుమార్ తో కలిసి మాజీ మంత్రి నారాయణ కుటుంబసభ్యులు కుట్రకు పాల్పడినట్టు తేల్చారు. విశాఖకు చెందిన చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు కొల్లి శివరామ్, గట్టెం వెంకటేష్ లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో శివరామ్, వెంకటేష్ లను మాత్రమే ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ఒక్కొక్కరి పాత్ర బయటకు తీయాలని..
మాజీ మంత్రి నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. బినామీగా కూడా రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నారాయణ చుట్టూ ముందుగా ఉచ్చు బిగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న టాక్ అయితే నడుస్తోంది. అటు తరువాత చంద్రబాబుతో పాటు టీడీపీలోని మాజీ మంత్రులు, కీలక వ్యక్తుల పాత్రలను కూడా బయటపెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నారాయణ సమీప బంధువుల పేర్లను సీఐడీ అధికారులు బయటపెట్టారు. దూళిపాళ్ల వెంకట శివ పంకలరావు, ఆయన భార్య పద్మావతి, కోడలు సృజన, లక్ష్మీశెట్టి సూర్యనారాయణ, అంబటి సీతారాము, లక్కకుల హరిబాబు, పద్మావతి, చిక్కాల విజయసారధి, పర్చూరి వెంకయ్య భాస్కరరావు, పర్చూరి వెంకట ప్రభాకరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, ఆయన భార్య విజయ, కొండయ్య వెంకటేష్ ల పేరుతో మాజీ మంత్రి నారాయణ అసైన్డ్ భూములు కొనిపించారని సీఐడీ అధికారులు కోర్టులో వాదించారు. వీరంతా నారాయణ బంధువులుగానే పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నారాయణ భారీగా లబ్ధి పొందారని కూడా కోర్టులో వాదనలు వినిపించారు.
రిమాండ్ కు కోర్టు అభ్యంతరం…
అయితే సీఐడీ అధికారుల వాదనపై ఏసీబీ ప్రత్యేక కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిందితులుగా పేర్కొన్న వారికి రిమాండ్ విధించాలన్న విన్నపాన్ని తోసిపుచ్చింది. 2020లో కేసు నమోదైతే ఇన్నాళ్లూ ఏమిచేసినట్టు అని ప్రశ్నించింది. విచారణ డైరీని ఎందుకు కోర్టు ముందు ప్రవేశపెట్టలేని పేర్కొంది. అసలు కొన్నదెవరు? అమ్మినదెవరు? నష్టపోయిన దెవరు? బాధితులెవరు? అన్నది సమగ్రంగా లేని విషయాన్ని ప్రస్తావించింది. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అయితే మొత్తానికైతే సీఐడీ మాత్రం నారాయణ చుట్టూ ఉచ్చు బిగించిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ అందుకు తగ్గట్టు ప్రిపరేషన్ మాత్రం చేయలేదు. అయితే నారాయణ, తరువాత టీడీపీకి చెందిన మాజీ మంత్రులు,. చంద్రబాబు..ఇలా అందర్నీ వరుసగా బుక్ చేయాలన్న తలంపుతో వైసీపీ సర్కారు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.