Pawan Kalyan Alliances: ఏపీలో గత కొద్దిరోజులుగా జరుగుతున్నమూడు ముక్కలాటకు తెరపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెవలనివ్వనని చెప్పడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీచేసి ఉంటే వైసీపీ పవర్ లోకి వచ్చి ఉండేదా? అని ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా పొత్తులు ఖాయమని పవన్ సంకేతాలిచ్చారు. సత్తెనపల్లిలోని కౌలుభరోసా రైతు యాత్రలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే గతంలో కూడా పవన్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మరింత సమీపిస్తున్న కొలదీ వైసీపీపై ఆరోపణలు తీవ్రతరం చేయడంతో పాటు వైసీపీ విముక్త ఏపీకి ఆయన గట్టి ప్రయత్నాలే ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకే పొత్తులు కీలకం. జగన్ ఇప్పుడు ఆయనకు బలమైన ప్రత్యర్థి. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమున్న జగన్ ను ఢీకొట్టి ముందుకెళ్లే సాహసంచేయడం లేదు. అందుకే జనసేన చేయి కలిపితే కానీ ఆయనకు ధైర్యంగా ముందడుగు వేయలేని పరిస్థితి. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయి కలిపితే సునాయాసంగా జగన్ ను అధికారానికి దూరం చేయవచ్చని చంద్రబాబుకు తెలుసు. అందుకే జనసేన, బీజేపీలతో పొత్తు కోసం ఎక్కువగా ఆరాటపడుతోంది చంద్రబాబే.

అయితే ఆది నుంచి పవన్ చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇరువురు నాయకుల ప్రకటనలు ఉండేవి. అయితే పవన్ విషయంలో ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించిన సమయాల్లో చంద్రబాబు పోటీపడి మరీ సంఘీభావం తెలిపేవారు. అటు చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన కన్నీరు పెట్టుకున్నప్పుడు పవన్ స్పందించిన సందర్భాలున్నాయి. అయితే మొన్నటికి మొన్న పవన్ విశాఖ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది. ఆ సమయంలో మాత్రం చంద్రబాబు పవన్ వద్దకు వెళ్లి మరీ మద్దతు ప్రకటించారు. కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే రాజకీయంగా కాకుండా.. కేవలం వైసీపీ ప్రభుతంపైనే అనిఅర్థం వచ్చేలా మాట్లాడారు. అప్పట్లో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని ప్రచారం జరిగినా.. పవన్ ప్రధానితో కలిసిన తరువాత సీన్ మారింది. నాకు ఒక చాన్స్ అని పవన్.. తనకు చివరి చాన్స్ అని చంద్రబాబు విన్నివించేసరికి పొత్తు ఉంటుందా? లేదా అన్న టాక్ ప్రారంభమైంది.
ఈ పొత్తుల ప్రతిష్ఠంభన ఒక వైపు కొనసాగుతుండగా.. అటు చంద్రబాబు, ఇటు పవన్ ఎవరికి వారు తమ మానాన పనిచేసుకుంటున్నారు. అటు బీజేపీ కూడా చంద్రబాబుకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. మూడున్నరేళ్లుగా చంద్రబాబు కలవడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ అడ్డుకున్నా.. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తోంది. కాస్తా డోర్లు తెరిచే ఉంచుతోంది. చంద్రబాబు కూడా తెలంగాణలో రాజకీయాల రియాక్టు చేసి అక్కడ తన అవసరం బీజేపీకి ఉండేటట్లు చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణలో బీజేపీతో కూటమి కట్టి.. దానిని ఏపీకి విస్తరించాలన్న ప్లాన్ తో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మేమంతా కలిసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చుండేదా? అని పవన్ తాజాగా ప్రశ్నించడంతో పొత్తుల చిక్కుముడిని కొద్దికొద్దిగా విప్పుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుకు పవన్ కావాలి. బీజేపీ సపోర్టు కావాలి. బీజేపీకి మాత్రం చంద్రబాబు వద్దు.. పవన్ తోనే నడుస్తామంటోంది. ఇప్పుడు పవన్ మాటలు చూస్తుంటే టీడీపీ తో కలిసి నడిచేందుకు బీజేపీని ఒప్పిస్తానన్నట్టు ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ ఏదో ఒక నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉంది. అందునా తెలంగాణ ఎన్నికలకు పది మాసాల వ్యవధే ఉండడంతో నిర్ణయం తీసుకోవడం బీజేపీకి అనివార్యంగా మారింది. అయితే పవన్ ప్రయత్నిస్తున్నట్టు, వ్యాఖ్యానిస్తున్నట్టు ఆ మూడు పార్టీలు కలిస్తే మాత్రం జగన్ కు ముచ్చెమటలు పట్టడం ఖాయం.