Telangana BJP: మీరు ఎమ్మెల్యే లేదా ఎంపీ పోటీ చేయాలనుకుంటున్నారా.. బీజేపీ టికెట్ కావాలని ఆశపడుతున్నారా.. అయితే రండి బాబు రండి..మావద్ద టికెట్లు అమ్మబడును.. ఆలసించిన ఆశాబంగం.. మంచితరుణం మించిపోతే రాదు.. అంటున్నారు కొంతమంది బ్రోకర్లు.. సినిమా హాళ్లవద్ద బ్లాక్‌లో టికెట్లు అమ్మిన చందంగా కొంతమంది బ్రోకర్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇప్పిస్తామంటూ తిరుగుతున్నారు. ఇటీవలే తెలంగాణలో మోయినాబాద్ ఫామ్‌హహౌస్‌లో ముగ్గురు స్వామీజీలు ఇలానే పట్టుపడ్డారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో సురభి శ్రీనివాస్‌ను ఆరెస్ట్ చేశారు. ఆయన కూడా బీజేపీ మహిళానేత గీతామూర్తికి టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడట. బాధితురాలి ఫిర్యాదు మేరకే పోలీసులు సురభి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

బీజేపీ తెలిసే జరుగుతోందా..
బీజేపీ టికెట్ల అమ్మకం వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్, సురభి శ్రీనివాస్‌కు బీజేపీలో టికెట్లు ఇచ్చే స్థాయి ఉందా అన్న విషయం చర్చనీయాంశమైంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో చేరేవారికి అధ్యక్ష స్థానంలో ఉన్నా టికెట్ హామీ ఇవ్వలేకపోతున్నారు. కానీ, కొంతమంది బ్రోకర్లు రంగంలోకి దిగి బీజేపీ టికెట్ ఇప్పిస్తామని ఆఫర్లు ఇవ్వడం కమలనాథులను కలవరపెడుతోంది. అసలు ఈ వ్యవహారం బీజేపీకి తెలిసి జరుగుతుందా లేక ఆ పార్టీ నేతలతో ఉన్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని బ్రోకర్లు డబ్లు సంపాదన కోసం ఇలా చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.
దృష్టిపెట్టకపోతే నష్టమే..
టికెట్ల అమ్మకం వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఇప్పటికైనా దృష్టిపెట్టాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. స్వామీజీల ముసుగులో టికెట్లు అమ్మకాలు సాగిస్తున్న అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కిందిస్థాయి నేతలు అభిప్రాయపడుతన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న నేతలు సైతం ఈ టికెట్ల విక్రయం వ్యవహారంపై ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలా కొంతమంది బ్రోకర్ల అవతారం ఎత్తుతున్నారని తెలుస్తోంది. దీనిని నియంత్రించకపోతే.. ఎన్నినల సమయం నాటికి బీజేపీలో టికెట్ల లొల్లి అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరి కమలనాథులు ఎలా స్పందిస్తారో చూడాలి.