https://oktelugu.com/

Kolkata : పూటకో మాట.. రోజుకో తీరు..కోల్ కతా వైద్యురాలి కేసులో నిందితుడిపై హైకోర్టు సంచలన నిర్ణయం

కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి కేసు లో రోజురోజుకు కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. సోమవారం పలువురిని ఇంటరాగేషన్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2024 / 08:00 PM IST

    Kolkatta Doctor Case

    Follow us on

    Kolkata :  కోల్ కతా లోని ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విచారణలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ భారత మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ఆనంద్ బోస్ కు లేఖ రాశారు. ఈ లేఖను తీవ్రంగా పరిగణించిన గవర్నర్ ఆనంద్ బోస్ సోమవారం రాజ్ భవన్ వర్గాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో కోల్ కతా నగర పోలీస్ కమిషనర్, బెంగాల్ డీజీపీతో కేసు పురోగతిపై చర్చించారు. జరుగుతున్న విచారణను సమీక్షించారు. ఇదే సమయంలో సిబిఐ అధికారులు చేస్తున్న విచారణపై ఆరా తీశారు.

    మరోవైపు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం కేసును విచారించే అవకాశం ఉంది. ఈ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సమాజంలో ఆడపిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. మరోవైపు ఈ కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహిళా వైద్యురాలిపై హత్యాచారానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్షన్) చేసేందుకు సిబిఐ కి కోల్ కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులకు నిందితుడు రోజుకో తీరుగా సమాధానం చెబుతున్నాడు. దీంతో ఈ కేసు విచారణలో పురోగతి ఉండడం లేదు. ఫలితంగా సిబిఐ అధికారులు కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదనలు పూర్తయిన తర్వాత ఈ కేసులో నిజ నిర్ధారణ కోసం పాలిగ్రాఫ్ కు హైకోర్టు ఓకే చెప్పింది. నిందితుడికి పాలిగ్రాఫ్ చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ అధికారులు కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. సోమవారం పై విధంగా హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాలి గ్రాఫ్ టెస్ట్ మాత్రమే కాకుండా CFSL నిపుణులతో సైకో అనాలసిస్, లేయర్డ్ వాయిస్ టెస్టులను కూడా నిర్వహించనున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలను సేకరించిన సిబిఐ అధికారులు.. మరింత సమాచారం రాబట్టేందుకు సంజయ్ రాయ్ ని విచారిస్తున్నారు.

    వైద్యురాలిపై హత్యాచారం జరిగిన తర్వాత.. ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్ లో సీసీటీవీ లలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు నెమ్మదిగా సాగడంతో కోల్ కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును విచారించాలని సిబిఐ అధికారులను ఆదేశించింది. దీంతో వారు ఈ కేసును విచారిస్తున్నారు. మూడు వారాల్లోగా కేసు విచారణ పూర్తి కావాలని సిబిఐ అధికారులకు కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.