
Graduate MLC Elections Results: ధర్మం గెలువని చోట…తప్పదు కత్తుల వేట జనతా గ్యారేజీలో ఓ పాటలో లిరిక్ ఇది, ఇది ఏపీలో పట్టభద్రులు కత్తుల వేట మాదిరిగా ఓటు అనే సమ్మోహన అస్త్రంతో వైసీపీని చీల్చిచెండాడారు. అయితే ఈ ఎన్నికలు అధికార పక్షం, ఇటు విపక్షాలకు స్పష్టమైన సంకేతాలు పంపాయి. ధర్మబద్ధంగా వ్యవహరించకుంటే మున్ముందు దారుణ ఓటములు తప్పవని అధికార పక్షానికి.. ఐక్యత లేనిదే బలమైన అధికార పక్షానికి ఢీకొట్టడం అసాధ్యమని విపక్షాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపాయి. ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ఇది ఇంకా ముఖ్యం అనుకోవచ్చు. ఏపీలో ప్రస్తుత రాజకీయం భిన్నంగా సాగుతోంది. కలిసి పని చేసే విషయంలో విపక్ష పార్టీలు ఇగో సమస్యలకు పోతున్నాయి. సీట్ల గురించి చర్చించుకోకుండానే బయట మాట్లాడేస్తున్నారు. ఇది ఆయా పార్టీల మధ్య విశ్వాసాన్ని తగ్గిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కానీ దానికి క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం విపక్షాలపై ఉంది. కానీ విపక్షాలు చూస్తుంటే మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. విపక్ష పార్టీల్లో అధికార పార్టీ అనుకూలం, వ్యతిరేకిలు మధ్య కీచులాటలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట పంజాబ్ లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ సమయంలో విపక్షాల్లో ఆప్ ఒక్కటే వారికి బలమైన పార్టీగా ప్రజలు గుర్తించారు. అప్పటివరకూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీని పక్కనపెట్టి మరీ ఆప్ ను ఆదరించారు. అంతులేని మెజార్టీని కట్టబెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థకు పంజాబ్ ఫలితం ఒక చెంపపెట్టులా మారింది. ఎక్కడో మూలన ఉన్న ఆప్ ను ముందుకు తెచ్చి ప్రజలు అధికారాన్ని అప్పగించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ సర్కారును వద్దనుకున్నారు. ఓటుతో తమ స్పష్టమైన తీర్పునిచ్చారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలోని పది లక్షల మంది పట్టభద్రులు తమ తీర్పునిచ్చారు. మెజార్టీ పట్టభద్రులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేశారు. మిగిలిన కోస్తా ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత మించి ఉంది. అటు జగన్ సొంత జిల్లా కడపలో సైతం వైసీపీని కిందపడేశారు. ఇటువంటి సమయంలో విపక్షాలు జాగ్రత్తపడాలి. కిందపడ్డ అధికార పక్షాన్ని లేవకుండా చేయాలి. ఇందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలి. ప్రజాకంటక పాలన అంటూ ఒక ముద్ర వేశారు కాబట్టి.. దానిని ఉధృతం చేసి ప్రజాగ్రహం ఎగసిపడేలా చేయ్యాల్సిన కనీస బాధ్యత విపక్షాలపై ఉంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విషయంలో స్పష్టతనిచ్చాయి. విపక్షాలు ఐక్యతగా వ్యవహరిస్తే విజయం తప్పకుండా వరిస్తుందని తెలియజేశాయి. అందుకు రెండో ప్రాధాన్యత ఓట్లే ఉదాహరణ. అటు టీడీపీ కైవసం చేసుకున్న మూడు పట్టభద్రుల స్థానాలు రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచినవే. అవి లెఫ్ట్ పార్టీలతో టీడీపీ కుదర్చుకున్న అవగాహన ఫలితమే. ఇంతకంటే గ్రౌండ్ రియాలిటీ ఫలితం, ప్రయోగం గురించి చెప్పనవసరం లేదు. అందుకే ఉన్న ఏడాది తమ రాజకీయ లెక్కలను పక్కనపెడితే ప్రజాకంటక వైసీపీ పాలనను అంతమొందించేందుకు విపక్షాలకు ఇదో సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు.