Homeఆంధ్రప్రదేశ్‌AP DSC 2023: డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

AP DSC 2023: డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

AP DSC 2023
AP DSC 2023

AP DSC 2023: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియకు కదలిక వచ్చింది. ప్రభుత్వం కీలక ప్రకటన జారీచేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిమిత పోస్టులతో డీఎస్సీ ప్రకటనకే పరిమితమైంది. మెగా డీఎస్సీ ఊసే లేకుండా పోయింది. గత నాలుగేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో బీఈడీ అభ్యర్థులు, ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్న వారికి ఎదురుచూపులు తప్పలేదు. అటు పక్కన తెలంగాణలో డీఎస్సీ ప్రకటన వెలువడినా ఇక్కడ మాత్రం అటువంటి సన్నాహాలు ఏవీ కనిపించలేదు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ పై మాట్లాడారు. జూలై, ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వివిధ దశల్లో 12,540 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్టు ఆయన వివరించారు.

అమలుకాని జగన్ హామీలు..
టీడీపీ హయాంలో డీఎస్సీ నియామక ప్రక్రియ అధికంగా జరిగింది. 2014 రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 2018లో విపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై కామెంట్స్ చేశారు. ఇవి ఒక పోస్టులేనా? అంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేస్తామని ప్రకటించారు. జాబ్ కేలండర్ తో పాటు డీఎస్సీ ప్రకటన తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. కానీ అవేవీ జరగలేదు. అటు జాబ్ కేలంటర్ ఊసు లేదు. డీఎస్సీపై ప్రకటన కూడా చేయలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.

AP DSC 2023
AP DSC 2023

భర్తీ చేసింది స్వల్పమే…
జగన్ సర్కారు ఉపాధ్యాయ పోస్టులను స్వల్పంగా భర్తీ చేసింది. వివిధ విభాగాల్లో పరిమిత పోస్టులనే భర్తీ చేయగలిగింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీలను కలిపి డీఎస్సీలోనే చూపింది. సహజంగా డీఎస్సీలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు అధికం. కానీ వాటి జోలికి పోకుండా మిగతా వాటికి ప్రాధన్యం ఇచ్చింది. వందల సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసింది. కానీ వేలల్లో భర్తీ చేసినట్టు చెప్పుకుంటూ వస్తోంది.

అభ్యర్థుల్లో అనుమానం..
అసలు డీఎస్సీ వస్తుందా? అన్న అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకంతో చాలామంది శిక్షణ తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా వ్యయప్రయాసలకోర్చి కోచింగ్ పొందుతున్నారు. కానీ ఇది ఎన్నికల చివరి ఏడాది. ఇంకా పట్టుమని 10 నెలలు కూడా లేదు. జనవరి నాటికి ఎన్నికల మూడ్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెల్లడయ్యే చాన్స్ ఉంది. సాంకేతిక, చట్టపరమైన అంశాలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడో 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇప్పుడు కొలువులు ప్రకటించారు. అలాగని పోస్టింగులు ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో మంత్రి బొత్స జూలై, ఆగస్టు అంటూ గడువులు ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version