Janasena Yuvashakti Sabha శ్రీకాకుళం జిల్లాలో జనసేన యువశక్తి కార్యక్రమం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. పొలిటికల్ గా హైఓల్టేజీ ఫీవర్ నెలకొంది. యువతను సంఘటితం చేస్తూ జనసేన చేపట్టబోయే యువశక్తి కార్యక్రమం అధికార, విపక్షాల్లో సెగలు రేపుతోంది. రణస్థలంలో నిర్వహించబోయే యువ శక్తి కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు నిన్నటి వరకూ పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో కార్యక్రమ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై రాజకీయంగా దుమారం రేగడంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. పోలీస్ శాఖ అనుమతి ఇవ్వడంతో జనసేన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమానికి లక్షమంది వరకూ యువత వస్తారన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో 33 నియోజకవర్గాలున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి యువత యువశక్తి తరలివచ్చే అవకాశముంది.కార్యక్రమానికి సంబంధించిన పార్టీ జెండాలు, డెలిగేట్ పాసులు, వాలంటీర్ల ఐడెంటీ కార్డులు, పోస్టర్లను ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని మండలాలకు పంపించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు వీటిని ఒక క్రమ పద్ధతిలో ఆయా ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు రణస్థలం దగ్గరగా ఉండడంతో లక్షలాది మంది యువత స్వచ్ఛందంగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అన్నిరంగాల్లో యువతను ఒక వేదికపై తెచ్చి అభిప్రాయాలను సేకరణ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే యువ కవులు, రచయితలు, కళాకారులకు ఆహ్వానాలు అందాయి. అటు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటుచేశారు.
అటు పవన్ కూడా యువత మాటలు వినాలని ట్విట్ చేసి మరింత హీట్ పెంచేశారు. యువశక్తి ద్వారా యువత మనోగతాన్ని తెలుసుకోవాలన్న ఆతృతగా ఉందని చెప్పారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా ట్విట్ తో జన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇంకా మూడు రోజుల వ్యవధే ఉండడంతో కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
మరోవైపు ప్రభుత్వం జీవో 1 పేరిట విపక్షాలపై పట్టుబిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తున్నారు. తొక్కిసలాటలకు అవకాశం లేకుండాఅన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కందుకూరు, గుంటూరు ఘటనల్లో కుట్ర కోణం దాగి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసైనికులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిస్తున్నారు. ప్రతీ జన సైనికులు జాగ్రత్తగా మసులుకొని కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలకు అవకాశం లేకుండా చూసుకోవాలని సూచనలిస్తున్నారు. యువశక్తికి హాజరయ్యే ప్రతిఒక్కరూ తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలని కొన్నిరకాల జాగ్రత్తలతో కూడిన హెచ్చరికలు ఇస్తున్నారు.