AP Salaries: ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ నెల కు సంబంధించి మూడో వారం సమీపిస్తున్నా ఉద్యోగులకు జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు పింఛన్ మొత్తం అందించలేదు. మరోవైపు చూస్తే పండుగ ముంచుకొస్తోంది. పండుగ ఖర్చులు తలుచుకొని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల తమకు ఎదురుచూపులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పులు పుడితే కానీ.. తమ జీతాలు చెల్లింపులు కాకపోవడంతో వారు తెగ ఆందోళన చెందుతున్నారు.
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. రాబడి కోసం మద్యం,ఇసుక, పన్నులపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ మూడు తప్ప ఇతరత్రా ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రతినెల రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవడం, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లి మరీ రుణాలు సాధించడం.. అయినా సరే సమయానికి జీతాలు చెల్లించకపోవడం దారుణం. కనీసం నెలలో మూడో వారం సమీపిస్తున్నా సగం మంది కూడా జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. దీంతో ఉపాధ్యాయులు, అటు వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి.. కానీ ఆదాయం పెరగడం లేదు. మద్యం ద్వారా ఏడాదికి 55 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం 32 వేల కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తోంది. మిగతా మొత్తం ఎవరి జేబులోకి వెళ్తున్నట్లు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా ప్రశ్నించారు. దీనిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రతినెలా చివరి వారంలో రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా వెళ్తున్న క్రమంలో అప్పు పుడితే జీతాలు, పెన్షన్లకు సమస్య లేకుండా చూస్తున్నారు. ఒకవేళ అప్పు పుట్టడంలో జాప్యం జరిగితే మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. కానీ అది ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయట పడేందుకు సరిపోయింది. దీంతో యధావిధిగా జీతాలు ఇచ్చేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటివరకు పెన్షన్ దారులకు 500 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా 1100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. జీతాలు, పెన్షన్లకు 5500 కోట్ల రూపాయలు అవసరం కాగా.. ఇప్పటివరకు 2900 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా అయితే ఈ నెల జీతాలు నాలుగో వారం దాటనున్నాయని తెలుస్తుండడం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.