Financial crisis: ఏపీ ప్రభుత్వం రోజురోజుకు దివాలా తీస్తోంది. ఆర్థికంగా కుదేలు అవుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఏరోజుకు ఆరోజు.. ఏ నెలకు ఆ నెలే అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్కారు తీరు. ఉద్యోగుల జీతాలు.. ప్రభుత్వ పథకాలు.. ఇతర ఖర్చులకు రూపాయి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇన్నాళ్లు ఖర్చులకు వెనకాడని సీఎం జగన్ ఇక పొదుపు మంత్రం జపిస్తున్నారు. ఎక్కడ రూపాయి మిగిల్చితే.. బాగుంటుందని ఆరా తీస్తున్నారు. అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన చిన్న ఆలోచనతో రూ.25 కోట్లు మిగిల్చారు. దీంతో ఇలాంటి ఆలోచనలు.. ఆచరణలు మరిన్ని చేయాలని భావిస్తున్నారు ఏపీ సర్కారువాళ్లు.

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ సర్కారు పలు సంక్షేమ పథకాల అమలు కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేసింది. నవరత్రాల పేరిట అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఠంఛన్ గా నిధులు సైతం మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజల నుంచి నెగెటివ్ పేరు రావొద్దని భావించిన సర్కారు అప్పులు చేసి మరీ.. పథకాలకు నిధులు సమకూర్చింది. ఇందులో కొన్ని అనవసర ఖర్చులు కూడా ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు, ఇతర వర్గాలవారు అంటున్నా.. పట్టించుకోని ఏపీ సీఎం జగన్ తనదైన పంథాలో ముందుకు సాగాడు. రెండేళ్లు గడిచింది. తెచ్చిన అప్పులకుప్ప పెరిగిపోతోంది. దీంతో డైలామాలో పడిన ఏపీ సర్కారు పొదుపు మంత్రం పాటిస్తోంది. ఇక పై వృథా ఖర్చులు చేయడం మానేయాలని చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగా సర్కారు సంక్షేమ పథకాల్లో వందశాతం అర్హత కలిగిన వారికే భాగం కల్పించాలని అధికారులకు సూచిస్తూ.. ఆ దిశగా కిందిస్థాయిలో సర్వేకు ఆదేశించింది.
ఈ క్రమంలో అధికారులు సర్కారుకు నివేదిక ఇచ్చారు. పింఛన్లలో కోత పెడితే కొంతైనా ఆదాయం మిగులుతుందని చెప్పడంతో ఆదిశగా అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. ఆచరణ ప్రారంభించిన మొదటి మాసంలోనే రూ.25కోట్లు మిగిల్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో లక్షమంది పెన్షనర్లపై భారం పడింది. ఆసరా పేరిట అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లను పరిశీలించేందుకు అధికారులు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఉంటే ఒకటి కట్ చేశారు. ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఉంటే ఒకటి నిలిపివేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా.. ఇతర రూపాల్లోనూ కోతలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే క్రమంలో పించన్ల కోత.. తరువాత ఇతర పథకాల కోతపై సర్కారు దృష్టి సారిస్తోంది. క్రమంలో ఏపీ మళ్లీ గాడిన పడేలా ఆలోచన చేస్తున్నారు సీఎం జగన్.