Evergrande crisis: చైనాలో మరో రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే సంక్షోభంలో చిక్కుకుంది. దేశాదాయంలో ప్రధాన భూమిక పోషించిన సంస్థ నేడు నష్టాల్లో కూరుకుపోయింది. అమెరికాలో సంచలనం సృష్టించిన లేమన్ బ్రదర్స్ తర్వాత ఇదే పెద్ద సంక్షోభంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవర్ గ్రాండేపై ఆధారపడిన వారందరిలో అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. దీంతో అందరిలో భయం పట్టుకుంది.
ఈసంస్థ 280 నగరాల్లో దాదాపు 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో 2 శాతం వాటా ఈ సంస్థదే. ప్రస్తుతం ఎవర్ గ్రాండే సంస్థ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉంది. ఈ సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23 నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేదని ప్రకటించింది. కానీ దీని పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
చైనీయుల సంపదలో చాలా భాగం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. దీంతో చైనీయుల వ్యయాలు గణనీయంగా తగ్గనున్నాయి. మార్కెట్ కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికే చైనాకు 92 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఇది ఆ దేశ జీడీపీతో పోలిస్తే 353 శాతం ఎక్కువ. కానీ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించడంతో చైనాకు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. దీంతో దేశాదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
చైనాకు నష్టాలు వస్తే ఐరోపా దేశాల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతుంది. చైనా వద్ద దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్ల బాండ్లు ఉన్నాయి. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్ అత్యధికంగా స్టీల్, ముడి ఇనుము చైనాకు ఎగుమతి చేస్తోంది. ఎవర్ గ్రాండే సంక్షోభం విషయం బయటకు రావడంతో సోమవారం హాంకాంగ్ మార్కెట్లలో సంస్థ షేర్లు 15 శాతం దెబ్బతిన్నాయి. చైనా బీమా సంస్థ పింగ్ యాన్ షేరు విలువ దాదాపు 8 శాతం తగ్గింది.