Pawan Kalyan- YCP: జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార వైసీపీకి మరోసారి చాలెంజ్ చేశారు. 2024లో ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్ చేశారు. ఇక్కడే పుట్టా.. ఇక్కడే తేల్చుకుంటా.. నా యుద్ధం నేనే చేస్తానంటూ హెచ్చరించారు. మీపై పోరాటానికి ప్రధాని అనుమతి నాకు అవసరం లేదన్నారు. మీలా చాడీలు చెప్పే అలవాటు కూడా లేదన్నారు. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప,, నాస్వార్థానికి మాత్రం కాదన్నారు. నేను చేసే యుద్ధానికి బీజేపీ పెద్దలను అనుమతి అడగనని కూడా తేల్చేశారు. మీరు కొట్టిన గడపలన్నీ నా గుండెల మీద కొట్టినట్టేనని.,.వైసీపీ గడపలు కొట్టేదాకా విశ్రమించనని పవన్ శపథం చేశారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ విధానంలో బదులిస్తామని.. ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను బద్దలుకొడతామని హెచ్చరించారు. మాది విప్లవ సేన అని.. రౌడీసేన అనే పెద్దమనిషికి అదే రీతిలో బదులిచ్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసలు వైసీపీ పార్టీయేనా.. ఉగ్రవాద సంస్థా? అని ప్రశ్నించారు. పవన్ తాజా కామెంట్స్ తో అధికార పార్టీ నేతల్లో వణుకు ప్రారంభమైంది.

అటు ప్రభుత్వ సంస్థాగత లోపాలను ఎత్తిచూపుతునే.. వైఫల్యాలను, ఆగడాలపై పవన్ విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఎన్టీఆర్ తో జగన్ పోల్చుకోవడం వరకూ ఏ విషయాన్ని పవన్ వదల్లేదు. ప్రజల కన్నీళ్ల మీద వైసీపీ పాలకులు ఫ్యూడలిస్టిక్ కోటలు కడుతున్నారని… ఆ కోటలు బద్దలు కొట్టి చూపిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సొంత బాబాయి దారుణంగా హత్యకు గురైతే.. ఇంతవరకూ నిందితులు పట్టుకోలేని స్థితిలో సీఎం జగన్ పాలన చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. చేతిలో తల్వార్లు పట్టుకుని వివేకానందరెడ్డిని చంపేస్తే.. అలాంటి హంతకులకు మీరు మద్దతు తెలుపుతున్నారంటూ షటైర్లు వేశారు. . వారిని స్వయంగా జగనే కాపాడుతున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో అత్యాచారాలకు అడ్డే లేకుండా పోయిందని.. ఓ బాలికపై రేప్ జరిగితే.. ఒక రేప్ కే ఏంటి ఇంత గోల చేస్తారన్న కుసంస్కారం వైసీపీ నేతలది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీది. మీకు తోలు మందం వచ్చేసిందంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో పోల్చుకున్న జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడాగా అభివర్ణించారు. కిలో రూ.2 లకే కిలో బియ్యం అందించిన ఆయనెక్కడ? ప్రజల సొమ్మును కొల్లగొట్టిన మీరెక్కడ అంటూ చురకలు అంటించారు. యుద్ధం చేయాలని వస్తే నేరుగా తలపడతానని.. బీజేపీ పెద్దలకో.. ప్రధానికో చెప్పాల్సిన పనిలేదంటూ పవన్ తేల్చేశారు.
అయితే పవన్ తాజా కామెంట్స్ తో అధికార వైసీపీలో వణుకుప్రారంభమైంది. పవన్ ఓ పద్ధతి ప్రకారం అధికార పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నారు. ప్రధాని మోదీని విశాఖలో కలిసిన తరువాత పవన్ లో మార్పువచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీతో కాకుండా బీజేపీతో కలిసి వెళతారని అధికార పార్టీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. కానీ పవన్ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సర్కారును గద్దె దించుతానని శపథం చేశారు. అంటే ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీని అధికారం దూరం చేసేందుకు ఎటువంటి కఠిన నిర్ణయాలైనా తీసుకున్న చాన్స్ ఉందని అధికార పార్టీ నేతలు ఒక అంచనాకు వస్తున్నారు. జనసేన, బీజేపీలు టీడీపీతో కలిసే వెళతాయని చెబుతున్నారు. పవన్ పుణ్యమా అని వచ్చే ఎన్నికల్లో మూల్యం తప్పదని వైసీపీ నేతలు తెగ ఆందోళన చెందుతున్నారు.

అనవసరంగా పవన్ విషయంలో వైసీపీ అగ్రనేతలు తలదూర్చుతున్నారని.. అది పార్టీకి మైనస్ పాయింట్ అవుతోందని అధికార పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటం ఇష్యూను రేజ్ చేసి చేతులు కాల్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ అంటూ నానా యాగీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేసిందేనని ప్రజల్లోకి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అటు పవన్ అహంపై దెబ్బతీశారని….విపక్షాల ఐక్యతకు వైసీపీ అగ్రనేతలే బీజం వేశారని మండిపడుతున్నారు. వైసీపీ హైకమాండ్ లైట్ తీసుకోవచ్చు కానీ.. వచ్చే ఎన్నికల్లో పవన్ రూపంలో దారుణ ఓటమి తప్పదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.