Prakasam YCP: అన్నా రాంబాబు వెనుక వైవి సుబ్బారెడ్డి.. టార్గెట్ బాలినేని, మాగుంట

గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసిన రాంబాబుకు 81 వేల అత్యధిక మెజారిటీ లభించింది. 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

Written By: Dharma, Updated On : December 28, 2023 12:26 pm

Prakasam YCP

Follow us on

Prakasam YCP: ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు హై కమాండ్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి రూపంలో నిత్య అసంతృప్తి కనిపిస్తోంది. అటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం కంఫర్ట్ గా కనిపించడం లేదు. ఆ ఇద్దరి నేతల వ్యవహార శైలితో హై కమాండ్ విసిగి వేసారి పోతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ అంటేనే మండి పడిపోతున్నారు. జగన్ సైతం బాలినేని వదులుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. ఎంపీ మాగుంట మరోసారి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలంటే భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివాదం అలా ఉండగానే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. దీని వెనుక రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నారని ఆయన ఆక్రోశిస్తున్నారు.

గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసిన రాంబాబుకు 81 వేల అత్యధిక మెజారిటీ లభించింది. 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని బహిరంగంగా ప్రకటించడం విశేషం. పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నన్ను చాలా ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ నాయకులకు చెప్పిన పట్టించుకోలేదని ఆయన వాపోతున్నారు. అయితే ఆయన అస్త్ర సన్యాసం వెనుక మాగుంట శ్రీనివాసుల రెడ్డి కారణమని తెలుస్తోంది. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా కు ఏం చేసిందని ప్రశ్నించడం ద్వారా అన్నా రాంబాబు గట్టి సంకేతాలే పంపారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట ఎంపీగా పోటీ చేస్తే వ్యతిరేక ప్రచారం చేస్తానని కూడా తేల్చి చెప్పారు. గిద్దలూరు నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పోటీ చేయాలని జగన్ సూచించిన నేపథ్యంలోనే అన్నా రాంబాబు ఈ ప్రకటన చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరుల అభిప్రాయం అడిగినట్లు సమాచారం. అయితే టిడిపిలో చేరతానని చెప్పకుండా రిటైర్మెంట్ ప్రకటన వెనుక వైసిపి హై కమాండ్ ను ఇరుకున పెట్టేందుకే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ సామాజిక వర్గం అయితే తనను ఇబ్బంది పెడుతుందో.. అదే సామాజికవర్గాన్ని రాంబాబు టార్గెట్ చేయడం విశేషం. ప్రకాశం జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో జగన్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నా రాంబాబు వ్యాఖ్యల వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. గత కొద్దిరోజులుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్నేహంగా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ తరుణంలో అన్నా రాంబాబు హాట్ కామెంట్స్ చేయడం విశేషం. దీని వెనుక కచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారని.. ఆయనే ఈ తరహా ప్రకటనలు చేయిస్తున్నారని ప్రకాశం వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎలా తీసుకున్నా ప్రకాశం జిల్లా వైసీపీలో మాత్రం రోజురోజుకు వివాదాలు ముదురుతుండడం ఆ పార్టీకి మైనస్ గా మారనుంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు చేజేతుల అవకాశం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై హై కమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.