Uniform Civil Code: సివిల్‌ కోడ్‌ అమలుకు కేంద్రం సిద్ధం.. ఎవరికి లాభం.? ఎవరికి నష్టం?

మరోవైపు కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుపై జాతీయ లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఇదే సమయంలో ప్రధాని మోడీ కూడా దేశంలో రెండు చట్టాలు ఉండకూడదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు జాతీయ పార్టీగా మారిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం కామన్‌ సివిల్‌ కోడ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. దీనిపై విస్తృత చర్చ కూడా జరపాలని సూచించింది. ఈ సమస్య అన్ని మత వర్గాలకు సంబంధించినది కాబట్టి, పరిష్కారం కూడా విస్తృతంగా ఉండాలని కోరుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ప్రకారం దేశ పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు.

Written By: Raj Shekar, Updated On : June 29, 2023 3:32 pm

Uniform Civil Code

Follow us on

Uniform Civil Code: లోక్‌ సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలతో పాటు అన్ని స్థానిక పార్టీలూ ఈ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ‘యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌‘ గురించి ఆయన ప్రస్తావించడం రాజకీయాల్ని మరో మలుపు తిప్పింది. ఇన్ని రోజులు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు మాత్రమే కామన్‌ సివిల్‌ కోడ్‌ గురించి మాట్లాడారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీని అమలు కోసం ప్రత్యేక కమిటీలు కూడా వేశారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. త్వరలోనే కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుకు కేంద్రం సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ‘ఒకే దేశంలో విభిన్న చట్టాలెందుకు..?’ అని ప్రశించడం ద్వారా మోదీ పరోక్ష సంకేతం ఇచ్చారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొలిటికల్‌ అస్త్రాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని తెలుస్తోంది. గతంలో ఆర్టికల్‌ 370 రద్దు, రామ జన్మభూమిని అజెండాలో చేర్చి వాటిని నెరవేర్చిన బీజేపీ… ఇప్పుడు యూసీసీపై దృష్టి సారించింది. ఎలాగైనా దీన్ని అమలు చేస్తాం అనే సంకేతాలిస్తూ ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటోంది.

ముదిరిన వివాదం..
కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలును చాలా రోజులుగా ముస్లిం వర్గాలు, కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రధాని మోదీ ప్రకటనతో అది మరింత ముదిరింది. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ దీనిని మొదట పంజాబ్‌లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో అనేక సమస్యలు ఉండగా, ప్రధాని కామన్‌ సివిల్‌ కోడ్‌ను తెరపైకి తెవడం ఏంటని కాంగ్రెస్‌ప్రశ్నిస్తోంది. ఇది కేవలం ఎన్నికల స్టంట్‌ అని ఆరోపిస్తోంది.

అభిప్రాయం కోరిన లా కమిషన్‌..
మరోవైపు కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుపై జాతీయ లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఇదే సమయంలో ప్రధాని మోడీ కూడా దేశంలో రెండు చట్టాలు ఉండకూడదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు జాతీయ పార్టీగా మారిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం కామన్‌ సివిల్‌ కోడ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. దీనిపై విస్తృత చర్చ కూడా జరపాలని సూచించింది. ఈ సమస్య అన్ని మత వర్గాలకు సంబంధించినది కాబట్టి, పరిష్కారం కూడా విస్తృతంగా ఉండాలని కోరుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 ప్రకారం దేశ పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు.

ముస్లింల వాదనేంటి..?
కామన్‌ సివిల్‌ కోడ్‌పై ముస్లిం సంఘాల వాదన మరోలా ఉంది. యూసీసీ మతపరమైన ఆచారాలకు విఘాతం కలిగిస్తుందంటున్నారు. నిజానికి.. ముస్లింలు షరియా చట్టాన్ని అనుసరిస్తారు. యూసీసీ అమల్లోకి వస్తే ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ ఉనికికే ప్రమాదమని వాదిస్తున్నాయి. అంటే… నేరుగా ముస్లింల హక్కులని అణిచివేయడమే అవుతుందని తేల్చి చెబుతున్నాయి. షరియా చట్టంలో ముస్లింలకు రక్షణ ఉందని, ఎన్ని చట్టాలు మారినా.. షరియా చట్టంలో మార్పులు తీసుకురావడం అంత సులభం కాదని తేల్చి చెబుతున్నాయి. యూసీసీ ద్వారా హిందూ సంప్రదాయాలను పాటించాలని.. ముస్లింలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.