Telangana Congress: కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు ఎక్కడలేని ఊపు వచ్చింది. పార్టీ అధిష్టానం కూడా ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న తెలంగాణపై దృష్టిపెట్టింది. కర్ణాటక తరహాలోనే తెలంగాణను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. కర్ణాటకలో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణ అమలు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక కాంగ్రెస్‌లో చేరికలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా కాలం తర్వాత గాంధీభవన్ సందడిగా మారుతోంది. నేతులు కూడా ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో జూలై 2న భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ సభలో బీఆర్‌ఎస్ మాజీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు 30 మంది కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. దీంతో ఈ సభ ద్వారా తెలంగాణలో గర్జించాలని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామన్న సంకేతం పంపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
భట్టి యాత్రం ముగింపు కూడా..
ఇక ఆదిలాబాద్ నుంచి మార్చి 11న ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీలుప్స్ మార్చ్ పాదయాత్ర కూడా జూలై 2న ముగియనుంది. ఖమ్మం సభలోనే పాదయాత్ర ముగిసేలా రూట్‌మ్యాప్ మార్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించే పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. భట్టి పాదయాత్ర కేడర్ లో జోష్ పెంచిందని, ఎన్నికల వేళ సమరానానికి సైన్యంలో పోరాట కసిని పెంచిందని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. హైకమాండ్ కూడా భట్టికి అరుదైన గౌరవం అందిస్తోంది. ఖమ్మం గడ్డపైన లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పార్టీ తరపున సత్కరించనున్నారు. తెలంగాణ భవిష్యత్ పై భరోసా ఇస్తూ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు ఖమ్మం జనగర్జన వేదికగా మారాలని భావిస్తోంది.
తెలంగాణలో గెలవాలి..
దక్షిణాదిని కర్ణాటక తరువాత కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్‌కు అధికారం దక్కాలని, కేంద్రంలోనూ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణ నేతలతో మీటింగ్ నిర్వహించిన అగ్రనేత రాహుల్ కూడా తెలంగాణను కాంగ్రెస్ ఖాతాలో వేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఒకరిద్దరి కారణంగా నష్టం జరుగుతున్నట్లు కూడా గుర్తించామని, మారకుంటే తొలగిస్తామని కూడా మెచ్చరించారు.
ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేలా..
తెలంగాణలో బీఆర్‌ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. దీంతో సహసంగానే పాలక పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులను కూడా దసరా నాటికి ప్రకటించేలా కసరత్తు చేస్తోంది. ఇక ఖమ్మం సభద్వారా తమ ఎజెండాను ప్రజల ముందు పెట్టాలని కూడా టీపీసీసీ భావిస్తోంది.
చక చకా సభ ఏర్పాట్లు..
ఖమ్మం సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అగ్రనేత రాహుల్ హాజరయ్యే సభను సక్సె చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టితో తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే సమావేశమయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్లపైన చర్చించారు. పార్టీలో చేరనున్న మాజీ ఎంపీ పొంగులేటిని సమావేశానికి ఆహ్వానించారు. ఖమ్మం సభ వంద ఎకరాల్లో నిర్వహించేలా కసరత్తు ప్రారంభించారు. భట్టి చారిత్రాత్మక యాత్ర ముగింపు సభగా.. పొంగులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తూనే దగా పడిన తెలంగాణ ప్రజల కోసం ఏం చేయనుందో స్పష్టత ఇవ్వనున్నారు.