Shekhar Master- Rakesh Master: జూన్ 18న రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ మాస్టర్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. రాకేష్ మాస్టర్ మృతి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన శిష్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రాకేష్ మాస్టర్ సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ పాల్గొన్నాడు. తన గురువు రాకేష్ మాస్టర్ కి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ… రాకేష్ మాస్టర్ తో ఎనిమిదేళ్ల అనుబందం నాది. విజయవాడలో డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు నాకు ప్రభుదేవా ఇన్స్పిరేషన్. హైదరాబాద్ వచ్చాక రాకేష్ మాస్టర్ డాన్స్ నాలో స్ఫూర్తి నింపింది. మీరు యూట్యూబ్ ఛానల్స్ లో ఆయన డాన్స్ చూసి ఉంటారు. మీరు చూసింది కేవలం ఐదు శాతం మాత్రమే. ఆయన గొప్ప డాన్సర్. ఉదయం, సాయంత్రం ఇంస్టిట్యూట్ లో క్లాసులు చెప్పేవాళ్ళం. మాకు డాన్సే ప్రపంచం. బయటకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు.
రాకేష్ మాస్టర్ చాలా కమిటెడ్ గా ఉండేవారు. చిన్న తప్పు చేసినా ఒప్పుకోరు. అందరి మూమెంట్స్ ఒకలానే ఉండాలనేవారు. రాకేష్ మాస్టర్ ఎప్పటికీ నాకు గురువే. ఆయనకు ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. మాస్టర్ ఎక్కడ ఉన్నా బాగుండాలి. ఆయన గురించి తప్పుడు థంబ్ నెయిల్స్ వార్తలు రాయడం ఆపేయండి. యూట్యూబ్ ఛానల్స్ కి నేను చేసే విజ్ఞప్తి అదే. ఉన్నది చెప్పండి. లేని విషయాలు క్రియేట్ చేసి కుటుంబాలను బాధ పెట్టొద్దు… అని ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ వద్ద వందల మంది డాన్స్ నేర్చుకున్నారు. ప్రభాస్ కి కూడా ఆయన డాన్స్ నేర్పారు. రాకేష్ మాస్టర్ శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇప్పుడు టాప్ పొజీషన్స్ లో ఉన్నారు. శేఖర్ మాస్టర్-రాకేష్ మాస్టర్ కి కొన్నేళ్ల క్రితం విబేధాలు తలెత్తాయి. అప్పటి నుండి ఇద్దరికీ సంబంధాలు లేవు. ఒక దశలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చిరంజీవి నటించిన ఖైదీ 150 చిత్రంలో రెండు పాటలు శేఖర్ పని చేశాడు. ఆ ఆఫర్ గురించి తనకు చెప్పకుండా దాచాడని రాకేష్ మాస్టర్ హర్ట్ అయ్యాడు.