దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నా… నాయకత్వ లేమితో రోజురోజుకు దిగజారిపోతోంది. ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలను టీఆర్‌ఎస్ ఆకర్షించగా.. ఇప్పుడు బీజేపీ వంతైంది. వరుసబెట్టి కాంగ్రెస్ నాయకులకు కమలం కండువా కప్పుతోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్‌ను తమవైపు లాక్కున్న కమలదళం.. ఇప్పుడు బడా నేతలపై దృష్టి పెట్టింది.
Also Read: వరదల్లో కొట్టుకుపోయిన కారు.. అదే వరదలో వికసించిన కమలం
మాజీ మంత్రి చంద్రశేఖర్ గ్రీన్ సిగ్నల్
గ్రేటర్ లో ఘోర పరాభవం తర్వాత బడా లీడర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వికారాబాద్ కి చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నాగర్జున్ సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలసిందే. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి జానారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరఫున ఆయన నాగార్జున సాగర్ బై-పోల్ లో పోటీ చేస్తారని తెలుస్తోంది.
కోమటి రెడ్డి సోదరులు సైతం..!
పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే.. కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరతామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే..! వారితో బీజేపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఊగిసలాడుతోంది.
Also Read: టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి.. జీహెచ్ఎంసీ ఫలితాలపై సంచలన కామెంట్స్!
టీఆర్‌ఎస్ నుంచి కూడా..
టీఆర్‌ఎస్ నుంచి కూడా బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కమలం కండువా కప్పుకున్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణిపై చాలామంది అసంతృప్తితో ఉండడంతో వారికి బీజేపీ గాలం వేస్తోంది. మొత్తానికి ఇప్పుడు గాలంతా బీజేపీవైపు వీస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్