AP Govt- Supreme Court: ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల అధిపతుల మధ్య మాత్రం సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఎంతలా అంటే నడిరోడ్డుపై తోడబుట్టిన సోదరి పాదయాత్రను అడ్డుకొని అమానుషంగా పోలీస్ స్టేషన్ కు తరలించినా మౌనం వహించేటంతగా వారి మధ్య అనుబంధం పెనవేసుకుంది. గత ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ కథను ముగించి మొత్తం ఓటు బ్యాంక్ ను టీఆర్ఎస్ కు కన్వెర్ట్ చేశారు. దానికి ఫలితంగా జగన్ కు ఎంతలా సహకారం అందించాలో అన్నివిధాలుగా అందించారు కేసీఆర్ . రెండు రాష్ట్రాల్లో అనుకున్నట్టుగానే ఇరువురూ కొలువుదీరారు. దీంతో విభజన హామీలు, ఆస్తుల సర్దుబాటు అవుతాయని ప్రజలు భావించారు.. ఆశించారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలతో మాకేంటి అన్నట్టు ఇరువురూ గ్రహించారు. రాజకీయంగా సహకారం అందించుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు సహకరించుకుంటున్నారు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ‘సెంటిమెంట్’ అస్త్రాన్ని బయటకు తీసి ఉభయతారకంగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ ‘బీఆర్ఎస్’కు సహకరించేందుకునేనన్న కుట్రను జగన్ అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఉన్న ఆస్తుల విభజనపై సరికొత్త డ్రామాలు మొదలుపెట్టారు. జగన్ సర్కారు ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మూడున్నరేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా కేసీఆర్ కు అడిగిన దాఖలాలు లేవు. కనీసం ప్రశ్నించినట్టు లేదు. అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఎంతకావాలో అంత సాన్నిహిత్యం ఉంది. అడిగే చనువు ఉంది. అడిగేందుకు చాలారకాలుగా అవకాశాలు వచ్చాయి. పైగా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఆగ్రహంతో ఉన్న కేంద్ర పెద్దలు అడిగిందే తడువుగా సాయం చేసే పరిస్థితి ఉంది. అయినా అవేవీ చేయకుండా ఏపీకి తెలంగాణ నుంచి విభజన ఆస్తులు రావాల్సి ఉందని ఏకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడం దేనికి సంకేతం. ఇందులో కూడా బయటకు తెలియని రాజకీయ వ్యూహాలు కచ్చితంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విభజన హామీల అమలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని.. రెండు రాష్ట్రాల్లో మరో సారి సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించి పవర్ లోకి రావాలన్న ఎత్తుగడ కనిపిస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగి సుదీర్ఘ కాలమవుతోంది. ఎనిమిదేళ్లు అవుతున్నా విభజన హామీలు అమలు చేయలేదు. విభజన జరిగిన తొలినాళ్లలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విద్యుత్ వంటివి సర్దుబాటు జరిగాయి. కానీ కేసీఆర్ కొన్ని విషయాల్లో చంద్రబాబును చికాకు తెప్పించారు. దీంతో చంద్రబాబు కేంద్రం వద్ద ‘పంచాయితీ’పెట్టారు. కానీ అప్పటికే కేసీఆర్ పట్ట కేంద్ర పెద్దలు సాప్ట్ కార్నర్ లో ఉండడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల కోసం చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ కేసును ఉపసంహరించుకుంది. కేవలం కేసీఆర్ తో ఉన్న రాజకీయ సంబంధంతోనే కేసును ఉపసంహరించుకున్నారన్న కామెంట్స్ వినిపించినా జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
రెండు ప్రభుత్వాలు కూర్చొని విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఇరువురు అధినేతలు కేంద్రం సూచనను బేఖాతరు చేశారు. కనీసం విభజన హామీలపై చర్చించేందుకు కూడా వారికి తీరిక దొరక లేదు. ఉభయ రాష్ట్రాల అధికారులు చర్చించారు.. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది అధినేతలే కావడంతో ప్రతిష్ఠంభన ఎదురైంది. అదే విషయాన్ని కేంద్రానికి చెప్పారా? మీరే పరిష్కరించండి అని కోరారా? అంటే అదీ లేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. తెలంగాణలో ఉమ్మడి ఆస్తులుగా రూ.1.42 లక్షల కోట్లు ఉన్నాయని వాటని సర్దుబాటు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు, న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి రాష్ట్ర విభజనపై ఆయన పోరాటమే. ప్రత్యేక హోదాతో ఏపీ భవిత మారిపోతుందని.. విభజన హామీల అమలులో చంద్రబాబు వైఫల్యం చెందారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దీంతోమంచి విజయం దక్కించుకున్నారు. అయితే గత మూడున్నరేళ్లుగా విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా వంటి విషయాలను పక్కనపడేశారు. దీంతో ప్రజల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అటు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా విస్తరించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి కేసీఆర్ నెట్టుకొచ్చారు. ఇప్పుడు జాతీయ పార్టీగా విస్తరణతో అవకాశం లేకపోయింది. అందుకే జగన్ సర్కారు కోర్టులో పిటీషన్ వేయడం ద్వారా కేసీఆర్ కు సరికొత్తగా సెంటిమెంట్ అస్త్రాన్ని అందించారు. తానూ రాష్ట్ర విభజన కోసం పోరాడుతున్నానని ఏపీ ప్రజలకు నమ్మించే పనిలో పడ్డారు జగన్. అయితే ఆది నుంచి విభజన, ప్రత్యేక హోదా విషయంలో జగన్ ‘సరెండర్, సైలెంట్’ వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఫస్ట్ టైమ్ కోర్టును ఆశ్రయించడం కూడా వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.