JK Election Results: ఫలితాలు అనుకూలంగా రావడంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కీలక నేత ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ” ప్రజలు వారికి నచ్చిన తీర్పు ఇచ్చారు. ఎవరి చేతుల్లో జమ్మూకాశ్మీర్ భద్రంగా ఉంటుందో ప్రజలకు తెలుసు. అందువల్లే వారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు జమ్ము కాశ్మీర్ ప్రజల కచ్చితత్వానికి నిదర్శనం. జమ్మూ కాశ్మీర్ ప్రజల గొప్పతనాన్ని మేము ప్రతిబింబిస్తాం. వారి సంస్కృతిని మేము కాపాడుతాం. వారి జీవితంలో మేము మార్పులు తీసుకొస్తాం. కచ్చితంగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా అవుతారని” ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
దానిని ప్రజలు ఒప్పుకోలేదు
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ప్రజలు ఆమోదించడం లేదనేది ప్రస్తుత పరిస్థితుల బట్టి తెలుస్తోందని” ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఓమర్ అబ్దుల్లా బుడ్గామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కాగా, గతంలో ఆర్టికల్ 370 సమయంలో ఓమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను హౌస్ అరెస్టు చేసింది. దీంతో అప్పటినుంచి ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఒకానొక దశలో కూటమిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో తన పార్టీని భాగస్వామ్యం చేశారు. అదేవిధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించారు. ఫలితంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారాన్ని దక్కించుకుంది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తాగునీరు, మరుగుదొడ్లు, రహదారుల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాల నిర్మాణం వంటివి చేపట్టింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని సమూలంగా మార్చింది. లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరవేసింది. అయినప్పటికీ ఓటర్లు భారతీయ జనతా పార్టీని కాకుండా.. కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులను గెలిపించారు.. దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కలను కల్లగా మార్చారు. ఈ ఓటమి నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ బిజెపి నాయకులు అంతర్మథనం లో కూరుకుపోయారు.