YS Sharmila: త్వరలో ఏపీలో కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో వైఎస్ షర్మిలకు అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. ఫలితంగా అది ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని సమాచారం. ఏపీలో జరిగే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన తరుణంలో స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడుతున్న ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిని మీడియాలో రాకుండా జాగ్రత్త పడినప్పటికీ.. సోషల్ మీడియా వల్ల రచ్చ రచ్చ అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైయస్ షర్మిల కి సతీష్, కొండలరావు అనే అనుచరులు ఉన్నారు. షర్మిల తో వీరికి కొన్ని సంవత్సరాలుగా అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆ మధ్య తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేపట్టినప్పుడు వీరు తెరవెనుక ఉండి నడిపారని సమాచారం. సతీష్, కొండల రావు ఐరన్, స్టీల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆమోద పేరుతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట లో ఒక కర్మాగారం నెలకొల్పారు. బెనిట్ అనే పేరుతో కడప లోనూ ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. వీరికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పేరు మీద కొనసాగుతున్నాయి. వీరు తమ ఇండస్ట్రీ ద్వారా తయారు చేసే ఐరన్, స్టీల్ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఈ బొగ్గును నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు రవాణా చేసింది. మొదటినుంచి ఈ కంపెనీకి రమేష్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థనే బొగ్గు సరఫరా చేస్తోంది. పైగా ఈ బొగ్గును అది వివిధ ప్రాంతాలకు చెందిన సింగరేణి గనుల నుంచి తీసుకొని ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు రవాణా చేసేది. ఇక ఈ ఆమోద కంపెనీ నుంచి ఐరన్, స్టీల్ ను నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అయితే ఆమోద ఫ్యాక్టరీలో తయారైన ఐరన్, స్టీల్ ను సాహితి ట్రాన్స్పోర్ట్, అరిపుల్ల ట్రాన్స్పోర్ట్ అనే సంస్థలు కృష్ణపట్నం ఓడరేవుకు సరఫరా చేసేవి. మొదట్లో ఈ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు ఆమోద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం సక్రమంగానే చెల్లింపులు జరిపింది.. అదే నమ్మకంతోనే ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఆమోద గ్రూప్ ఇండస్ట్రీస్ కు బొగ్గు ను, ఆమోద గ్రూప్ ఇండస్ట్రీలో తయారైన స్టీల్, ఐరన్ ను ఇతర ప్రాంతాలకు రవాణా చేశాయి. అయితే నాలుగేళ్ల నుంచి ఆమోద ఇండస్ట్రీస్ యాజమాన్యం తీరులో మార్పు వచ్చింది.
ఆమోద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ కు కొండలరావు ఎండిగా ఉన్నారు. సతీష్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మొదటినుంచి షర్మిలకు వీరు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. పైగా షర్మిల అండదండలతోనే వీరు ఆ వ్యాపారంలో కోట్లు గడించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల అండ చూసుకొని వారు ఆ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు భారీగా బకాయిలు పడ్డారని.. వాటిని తిరిగి చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమాచారం. ట్రాన్స్పోర్ట్ సంస్థలకు చెందిన యజమానులు ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేశారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాహితీ ట్రాన్స్పోర్ట్ సంస్థకు 1.9 కోట్లు, అరిపుల్ల ట్రాన్స్పోర్ట్ సంస్థకు 61 లక్షలు ఆమోద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చెల్లించాల్సి ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా బకాయిలు చెల్లించాలని కోరుతున్నప్పటికీ ఆమోద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీ యజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈ కంపెనీకి చెందిన సతీష్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కొండలరావు, సతీష్ షర్మిల పేరు చెప్పి తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని సాహితీ ట్రాన్స్పోర్ట్, అరిపుల్ల ట్రాన్స్పోర్ట్, రమేష్ ఎంటర్ప్రైజెస్ సంస్థల యజమానులు ఆరోపిస్తున్నారు. గతంలో వీరు ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమోద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ యజమాన్యం బాధితులను తీవ్రంగా బెదిరించింది. మీడియాలో ఈ వార్త వస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది. అయితే తమకు రావాల్సిన బకాయిలపై నేరుగా షర్మిలనే కలిసి అడుగుతామని బాధితులు చెబుతున్నారు. త్వరలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి.. ఎన్నికలకు వెళ్దాం అనుకుంటున్న షర్మిలకు.. ఆమె అనుచరులు చేసిన పని ఇబ్బంది కలిగిస్తోంది. మరి దీనిపై షర్మిల ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.