Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించక పోవడానికి కారణం అదే

తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిడిపిలో రాణించిన సినీ నటులు ఎంతోమంది ఉన్నారు. రామానాయుడు, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, ఊర్వశి శారద, జయప్రద వంటి టాలీవుడ్ ప్రముఖులంతా టిడిపిలో పదవులు నిర్వర్తించారు.

Written By: Dharma, Updated On : October 7, 2023 4:55 pm

Chandrababu Arrest

Follow us on

Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి దాదాపు నెల రోజులు అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా రకరకాల రూపంలో నిరసనలు చేపట్టారు. సానుభూతి ప్రకటించారు. జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు స్పందించాయి. రాష్ట్రంలో జనసేన, వామపక్షాలతో పాటు బిజెపి సైతం ముక్తకంఠంతో ఖండించింది. జనసేన అధ్యక్షుడు పవన్ అయితే నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించారు. అయితే ఇంత జరుగుతున్నా టాలీవుడ్ నుంచి ఎవరు ఖండించకపోవడం విశేషం.

తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. టిడిపిలో రాణించిన సినీ నటులు ఎంతోమంది ఉన్నారు. రామానాయుడు, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, ఊర్వశి శారద, జయప్రద వంటి టాలీవుడ్ ప్రముఖులంతా టిడిపిలో పదవులు నిర్వర్తించారు. అటు తరువాత చాలామంది సినీ ప్రముఖులు టిడిపితో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ పార్టీలో పని చేసిన మురళీమోహన్, అశ్విని దత్, రాఘవేంద్రరావు తదితరులు మాత్రమే స్పందించారు. మొన్న ఈ మధ్యన దర్శకుడు రవిబాబు స్పందించారు. అంతకుమించి ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. దగ్గుపాటి రామానాయుడు కుమారుడు సురేష్ బాబుఇదో పొలిటికల్ ఇష్యూ అని.. దీనికి స్పందించాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. అయితే టిడిపి ప్రభుత్వ హయాంలో మేలు పొందిన వారు సైతం ముఖం చాటేయడం పై రకరకాలుగా, ఆసక్తికర కథనాలు, వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. టాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించలేదో చెప్పుకొచ్చారు. జనసేన ఆవిర్భావం తర్వాత పవన్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయనపై వ్యక్తిగత కామెంట్లు సైతం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ముప్పేట దాడి ఎక్కువైంది. అటు కాపు మంత్రులు, ఇటు సినీ రంగం వ్యక్తులతో విమర్శల దాడి చేయించేవారు. సినీ రంగానికి సంబంధించి పోసాని కృష్ణ మురళి నిత్యం పవన్ పై విమర్శలు చేస్తుంటారు.అయితే ఒకటి రెండుసార్లు చిరంజీవి కుటుంబ సభ్యుల పై సైతం పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో కూడా ఇది తప్పు అని సినీ ప్రముఖులు ఎవరు ముందుకు వచ్చి చెప్పలేదు.

అయితే తాజాగా చంద్రబాబు అరెస్టు విషయంలో సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడానికి గల కారణాలను పవన్ విశ్లేషించారు.మొన్న ఆ మధ్యన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలను రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.తనకు చంద్రబాబు అత్యంత ఆప్త మిత్రుడని.. మంచి పరిపాలన దక్షుడని రజనీకాంత్ కొనియాడారు. అదే సమయంలో రజినీకాంత్ ను వైసీపీ నేతలు వెంటాడారు. వ్యక్తిగత కామెంట్స్ చేశారు. చివరకు ఆయన శరీర ఆకృతి గురించి సైతం మాట్లాడారు. ఇప్పుడు కానీ చంద్రబాబు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడితే రజనీకాంత్ పరిస్థితి ఎదురవుతుందన్న భయం వారిని వెంటాడుతున్నట్లు పవన్ చెబుతున్నారు. అందుకేతెలుగు సినీ ప్రముఖులు మౌనంగా ఉన్నారని పవన్ చెప్పుకొచ్చారు. దీనికి ముమ్మాటికి వైసిపి నేతల భయమే కారణమని పవన్ తాజాగా విశ్లేషించారు.