BL Santhosh: తెలంగాణలో ఆరు నెలల క్రితం వరకు అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ కర్ణాక ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించడంతో రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు కనిపించింది. చేరికలూ నిలిచిపోయాయి. పార్టీలో చేరాలనుకునేవారు పునరాలోచనలో పడగా, చేరిన వారు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటనతో బీజేపీ మళ్లీ తెరపైకి వచ్చింది. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో ఒక్కసారిగా అందరి దృష్టి బీజేపీవైపు మళ్లింది. ఈ క్రమంలో వచ్చే రెండు నెలల్లో తెలంగాణలో బహిరంగ సభలతో హోరెత్తించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలపై కమలనాథులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలకు హాజరైన బీజేపీ ముఖ్యనేత బీఎల్.సంతోష్ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హంగ్ ఖాయమట..
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాదని ప్రకటించారు బీఎల్.సంతోష్. కానీ, బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది పార్టీ నేతలకు చెప్పారు. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఎల్.సంతోష్ తాము మెజారిటీ సీట్లు గెలవమని చెబుతూనే అధికారం మాత్రం తమదే అని ప్రకటించారు.
ఎవరికీ 60 రావట..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికీ 60 సీట్లు(మ్యాజిక్ ఫిగర్) రావని సంతోష్ అభిప్రాయపడ్డారు. సర్వేలు తెలంగాణలో గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నాయని పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. చెరో యాభై సీట్ల వరకూ వచ్చినా హంగ్ వస్తుంది. కానీ బీజేపీకి ఆ రెండు పార్టీలతో పోటీ పడే ఛాన్స్ లేదు. అంత బలంగా లేదు. ఐదారు సీట్లు అయినా వస్తాయా అన్న సందేహం ఉంది. అయితే బీఎల్ సంతోష్ మాత్రం హంగ్ వస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నారు.
ఎక్‌నాథ్ షిండే ఎవరో..
ఇలాంటి సంక్షోభాల్లో బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందో అందరికీ తెలుసు. బీజేపీ అలాంటి రాజకీయాల్లో నంబర్ వన్. కానీ బీజేపీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మరో పార్టీ కలవాలి. అలా కలవాలంటే.. కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పోలరైజ్ కాకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా బీజేపీ తీసుకోవాలి. తీసుకుంటోంది కూడా. ఇప్పుడు అదే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పోలరైజ్ కాకుండా బీజేపీ కొన్ని కీలక ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో ప్రకటనల.. నిర్ణయాలు ఉంటున్నారని భావిస్తున్నారు. బీఅర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు భావిస్తే పోలరైజ్ అవుతాయి. అప్పుడు బీజేపీని కానీ మరో పార్టీని కానీపట్టించుకోరు. అలాంటి పరిస్థితి లేకుండా చేయడానికే బీజేపీ రాజకీయం చేస్తుంది. ఫలితాల తర్వాత మహారాష్ట్రలో తరహాలో తెలంగాణ ఏక్‌నాథ్ షిండేను ఎంపిక చేసి మెజారిటీ సీట్లు గెలిచిన పార్టీని చీల్చడం కాయమని తెలుస్తోంది. బీఎల్.సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.