Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఎందుకు పెట్టుకోలేదు? ఆది నుంచి క్వాష్ పిటిషన్ వైపే మొగ్గు చూపడానికి కారణం ఏమిటి? ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని వాదిస్తున్నది ఎందుకు? సాంకేతిక అంశాల చుట్టూనే వాదనలు ఎందుకు జరుగుతున్నట్టు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఏదైనా కేసులో అరెస్ట్ అయినా.. రిమాండ్ విధించినా వెనువెంటనే బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం బెయిల్ అంశాన్ని పక్కన పడేశారు. కేవలం సెక్షన్ 17 ఏ చుట్టూనే వాదనలు వినిపించారు. ఏకంగా కేసును కొట్టేయాలని న్యాయస్థానాలను కోరుతూ వచ్చారు.
వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి విచారణ చేపట్టింది. నలుగురు కీలక నిందితులను సైతం అరెస్టు చేసింది. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. కొన్ని డొల్ల కంపెనీలకు ప్రభుత్వ వాటా నిధులు వెళ్లినట్లు గుర్తించింది. నెల రోజులు ముందే పుట్టిన కంపెనీలకు సైతం పెద్ద ఎత్తున ధనం ముట్ట చెప్పినట్లు విచారణలో తేలింది. అయితే ఆ నలుగురి అరెస్టుతోనే ఈడీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా సిఐడి రిమాండ్లో సైతం చంద్రబాబు పాత్ర పై నివేదించినా.. దానికి ఈడిదర్యాప్తు, రిమాండ్ తోడైతే కేసు మరింత బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ కేసు కొట్టివేత వైపే చంద్రబాబు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
ఒకవేళ ఈ కేసులో బెయిల్ తీసుకుంటే వైసీపీకి ప్రచార అస్త్రంగా మారుతుందని అంతా భావించారు. కానీ దాని వెనుక లోగుట్టు ఉంది. బెయిల్ పై విడుదలయితే.. దానికి సమాంతరంగా సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో డొల్ల కంపెనీల బండారం బయటపడుతుంది. అదే గానీ జరిగితే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. అటు రాజకీయంగానే కాకుండా.. కేసు మరింత లోతుగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా బెయిల్ కాకుండా.. క్వాష్ పిటిషన్ తో ఏకంగా కేసు కొట్టివేత వైపే మొగ్గు చూపారు.
అయితే చంద్రబాబు రిమాండ్ నుంచి బయటకు రాకపోవడాన్ని జగన్ విజయంగా ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. కానీ అది చంద్రబాబు వ్యూహం. అందుకే సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తన వయసు దృష్ట్యా.. ఆరోగ్యం దృష్ట్యా బెయి ల్ కావాలని కోరితే కోర్టు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అటు ఏసీబీ కోర్టు విచారణలో సైతం మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? వసతులు బాగానే కల్పిస్తున్నారా? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సిఐడి అధికారులు నిబంధనలను పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే అదంతా వ్యూహాత్మకంగానే చంద్రబాబు ఆ సమాధానం చెప్పారని ప్రచారం జరుగుతోంది. బెయిల్ రాకుండా.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కొనసాగేవరకు చంద్రబాబు కావాలని జాప్యం చేసుకున్నారని అనుమానాలు ఉన్నాయి. సిఐడికి అవకాశం ఇవ్వకుండా క్వాష్ పిటిషన్ పై అనుకూల తీర్పు వస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు శాశ్వతంగా బయటపడినట్టే.