MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంలో ఈడి దర్యాప్తు తీరును తప్పుపడుతూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఈ కేసు కు సంబంధించి విచారణ జరిగింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్గాలు తీర్పు ఎలా వస్తుందోనని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టాయి. అయితే ఈ డి పై గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేసి విచారణ కొనసాగించాలని కవిత కోరారు. గత విచారణలో ఈడి తనకు జారీ చేసిన సమన్లను కూడా కవిత తప్పు పట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా తనకు సమన్లు జారీ చేయడం తగదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు నళిని చిదంబరానికి ఇచ్చినట్టే తనకు కూడా వెసలుబాటు ఇవ్వాలని కోరారు.
కేసు విచారణకు వచ్చిన తర్వాత కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించిన అనంతరం.. “అయితే మహిళను విచారణకే పిలవకూడదు అంటే ఎలా అని” సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహిళలను విచారణకు పిలవచ్చు, కాకపోతే రక్షణ ఉండాలని కవిత తరఫున న్యాయవాదులు వాదించారు. అన్నింటికీ ఒకే ఆర్డర్ ను అనుసంధానించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పది రోజులపాటు సమన్లు వాయిదా వేయడానికి ఈడీ అంగీకరించింది. కాగా, సుప్రీంకోర్టు కవిత పిటిషన్ పై విచారణ చేసేందుకు నవంబర్ 20 వరకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 20 వరకు ఆమెకు సమన్లు ఇవ్వకూడదని ఈడికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కవిత పిటిషన్ పై సుప్రీం విచారణ ప్రారంభం..
కాగా, మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, నళినీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి దీనిని విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చింది. కవితకు నోటీసులు అందిన విషయాన్ని గత విచారణలో న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాగా.. 10 రోజుల పాటు ఆమెను పిలవబోమని ఈడీ హామీ ఇచ్చింది. కవితకు ఊరట ఇచ్చే విధంగా తీర్పురావడంతో భారత రాష్ట్ర సమితి నేతలు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ 20 వరకు ఎటువంటి సమన్లు జారీ చేయకూడదని ఈడిని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల ముందు ఇది తమకు లాభం చేకూర్చుతుందని భారత రాష్ట్ర సమితి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కవిత ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది