TDP : సీనియర్లలో టెన్షన్… నేడు టిడిపి రెండో జాబితా ప్రకటన

అటువంటి వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు సీనియర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఆశావహుల్లో టెన్షన్ నడుమ రేపు రెండో విడత జాబితాను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అటు పవన్ తో పాటు బిజెపి నేతలు సైతం తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

Written By: NARESH, Updated On : March 13, 2024 6:52 pm
Follow us on

TDP : చంద్రబాబు దూకుడు పెంచారు. ఇప్పటికే బీజేపీతో పొత్తును కుదుర్చుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియన సైతం ఒక కొలిక్కి తెచ్చారు. ఇప్పుడు టిడిపి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా మిగిలిన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. రేపు టిడిపి రెండో జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది సీనియర్ల పేర్లు ఇంతవరకు ప్రకటించలేదు. వారి నియోజకవర్గాలను సైతం పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో రెండో జాబితా పై సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.

తొలుత జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. 94 మంది టిడిపి అభ్యర్థులు, ఐదుగురు జనసేన అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ చంద్రబాబుతో పాటు పవన్ తొలి జాబితాను విడుదల చేశారు. అయితే ఇప్పుడు బిజెపి కూటమిలోకి రావడంతో సీట్లకు సంబంధించి లెక్క మారింది. బిజెపికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు స్థానాలను ఖరారు చేశారు. అందులో జనసేన ఒక పార్లమెంట్ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసింది. తెలుగుదేశం పార్టీ సైతం ఒక అసెంబ్లీ సీటును వదులుకుంది. మొత్తం 144 స్థానాలకు మాత్రమే టిడిపి పరిమితం కానుంది. ఇప్పటికే 94 స్థానాలను ప్రకటించడంతో.. కేవలం 50 స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు ఎంపీ స్థానాలకు సంబంధించి 17 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతోఈ అభ్యర్థులను ఎంపిక చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఈ రాత్రికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రేపు రెండో విడత అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కోల్పోవడంతో.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారందరినీ చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మెత్తబడుతున్నారు. మరికొందరు రెబెల్ గా దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రెండో విడత 50 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుండడంతో… టిక్కెట్లు దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. అటువంటి వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు సీనియర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఆశావహుల్లో టెన్షన్ నడుమ రేపు రెండో విడత జాబితాను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అటు పవన్ తో పాటు బిజెపి నేతలు సైతం తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.