AP Power Cuts: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు కలవరపెడుతున్నాయి అప్రకటిత కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం విద్యుత్ కొనుగోలు చేసేందుకు కూడా సమాయత్తమవుతోంది.
రాబోయే పది రోజుల్లో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. కొత్త మంత్రివర్గం కొలువుదీరిన అనంతరం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో 208 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా జెన్ కో నుంచి 71 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 మిలియన్ యూనిట్లు, సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి 24 ఎంయూ, హిందూజా నుంచి 9.4 ఎంయూ సమకూర్చుకుంటోంది.
Also Read: రాష్ట్రంలో మొదటి మొబైల్ సినిమా థియేటర్!
ఈనెల 25 నాటికి విద్యుత్ సరఫరా కొలిక్కి వస్తుంది. దీంతో పంటలు, గృహ అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్నంత వరకు విద్యుత్ అందజేస్తామన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అవసరాలు తీరుతాయని సూచించారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతామన్నారు.విద్యుత్ కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నమన్నారు.
పదిరోజులుగా విద్యుత్ కోతలు ఎడాపెడా విధిస్తున్న సందర్భంలో రాత్రి పూట కరెంటు లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు పవర్ హాలిడే విధించడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో త్వరలో విద్యుత్ కోతలకు చెక్ పెడతామని మంత్రి చెబుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు తగిన విధంగా సరఫరా చేస్తామని ప్రకటించారు.