Ward By Elections: సాధారణంగా వార్డు _ఉప_ ఎన్నిక అంటే పెద్దగా ఎవరూ ఆసక్తి కనబరచరు. అటు పంచాయతీ ఎన్నికల సమయంలో సైతం ప్యానల్ ఉండాలని భావించి బలవంతంగా వార్డు సభ్యుల పదవులను కట్టబెడుతుంటారు. తాజాగా ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలతో పాటు వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా వరకు ఏకగ్రీవమయ్యాయి. అధికార పార్టీలో వర్గాలున్న చోట మాత్రమే పోటీ అనివార్యంగా మారింది. అయితే ఓ చోట వార్డు ఉప ఎన్నికల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు ఐదు నుంచి పదివేల రూపాయలు ముట్ట చెప్పడంతో పాటు.. బంగారం వెండి ఆభరణాలను సైతం అందిస్తున్నారు. దీంతో అది ఎంతటి ప్రాధాన్యం ఉన్న వార్డు స్థానమో అర్థమవుతుంది.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లె రాష్ట్రంలోనే అతిపెద్ద పంచాయతీ. ఇక్కడ 13వ వార్డుకు ఉప ఎన్నిక జరుగుతోంది. సర్పంచ్ గా శివచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తో పడదు. దీంతో ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడుతున్నారు.ఎమ్మెల్యే తన అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డిని నిలిపారు. అటు సర్పంచ్ సైతం తన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డిని పోటీలో పెట్టారు. దీంతో వైసీపీలోని రెండు వర్గాలు బహిరంగంగానే కయ్యానికి కాలు దువ్వాయి. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి దుమ్మెత్తి పోసుకున్నాయి.
ఈ వార్డులో మొత్తం 1171 ఓట్లు ఉన్నాయి. ఈరోజు పోలింగ్ జరుగుతోంది. అయితే ప్రలోభాల వల భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఓటుకు కనీసం 5000, గరిష్టంగా 10,000 ఇచ్చినట్లు సమాచారం. మహిళలకు బంగారం వెండి, గొలుసులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క వార్డు ఉపఎన్నికకే కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారు.ఇక్కడసర్పంచ్ కుటుంబానికి సీఎం జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.అందుకేసర్పంచ్ కుమారుడ్ని ఓడించడానికి విపక్షాలు సైతం ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపడం విశేషం. ఇక్కడ ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. భారీ స్థాయిలో పందాలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది.