Homeఆంధ్రప్రదేశ్‌Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ద్వారా కాంగ్రెస్ కూటమిలో తెలుగుదేశం?

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ద్వారా కాంగ్రెస్ కూటమిలో తెలుగుదేశం?

Prashant Kishor: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. అటు రాజకీయ ప్రక్షాలు సైతం వ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఎలాగైనా చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి బలమైన ప్రయత్నం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అందరి చూపు తెలుగు రాష్ట్రంపై పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ ప్రభావం ఏపీ పై పడనుందని అంచనాలు ఉన్నాయి.

అయితే ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలుగా వైసిపి, టిడిపి,జనసేన ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిల బలం అంతంత మాత్రమే. ప్రస్తుతం జనసేన మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. వైసిపి, టిడిపి జాతీయస్థాయిలో ఏ కూటమిలో లేకపోవడం విశేషం. వైసిపి బిజెపితో స్నేహభావం కొనసాగిస్తోంది. అటు టిడిపి సైతం బిజెపి స్నేహాన్ని కోరుకుంటుంది. బిజెపి మాత్రం ప్రస్తుతానికి టిడిపి, వైసీపీలకు సమదూరం పాటిస్తోంది. జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైనా ఆ రెండు పార్టీలు కలిసిన దాఖలాలు లేవు. పైగా బీజేపీ రాకుండానే జనసేన ఎన్నికల్లో టిడిపి తో పొత్తు తో ముందుకు వెళ్తామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు బిజెపి కలిసి వస్తుందా? రాదా?అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జాతీయస్థాయిలో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సత్తమత్తమవుతున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలపై విలువైన సలహాలు సూచనలు అందించేందుకు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది రాష్ట్రస్థాయిలో టిడిపి గెలుపు కోసం తో పాటు.. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహం పై చంద్రబాబుకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ నాయకత్వంతో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బిజెపి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిబలం పెంచుకునేందుకు ఆలోచన చేస్తోంది. అందులో కీలక భాగస్వామిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసి చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పాటు దేశంలో ఇండియా కూటమి పాత్ర పై ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చర్చించినట్లు టాక్ నడుస్తోంది.

ఈ పరిస్థితుల్లో అప్పుడే వైసిపి సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపితో.. ప్రశాంత్ కిషోర్ ద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయనది రెండు కళ్ళ సిద్ధాంతమని.. అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version