దేశంలో కరోనా మారణహోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ నిత్యం 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సీజన్ అందక ఇంకా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. అటు వ్యాక్సిన్ కూడా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొత్తంగా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొంది.
రోగులు ఆసుపత్రులకు వెళ్తే చాలు.. లక్షల బిల్లు వేసిగానీ బయటకు వదలట్లేదు ఆసుపత్రులు. ఒకవేళ చనిపోతే.. బిల్లు మొత్తం చెల్లిస్తే తప్ప శవాలను కూడా అప్పగించట్లేదు. హైదరాబాద్ లో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో.. పరిస్థితి ఎలా తయారైందేంటే.. లక్షల రూపాయలు ఉంటే దవాఖానకు వెళ్లాలి.. లేదంటే ఇంట్లోనే చావాలి అన్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు తీసుకుంటున్న సంచలన నిర్ణయం నిరుపేదలకు ఎంతో ఉపశమనంగా మారాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు.. మొత్తం ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నాయి.
ఈ నిర్ణయంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స అందుతోందో అందరికీ తెలిసిందే. దశాబ్దాల నుంచే సర్కారు దవాఖానాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. దీంతో.. సర్కారు ఆసుపత్రికి వెళ్తే చావే శరణ్యం అన్నట్టుగా భావిస్తున్నారు జనం.
దీంతో.. అప్పోసప్పో చేసైనా ప్రైవేటు ఆసుపత్రికే వెళ్తున్నారు. ఏ మాత్రం అవకాశం లేనివారు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని కొవిడ్ బాధితులకు ఉచిత వైద్యం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి, ఈ ప్రభుత్వాలు అలాంటి నిర్ణయం తీసుకుంటాయా? అన్నది ప్రశ్న.