
Pawan Kalyan- TDP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారా..? తెలుగుదేశం పార్టీ – జనసేన మధ్య కుదిరిన పొత్తులో భాగంగా ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టిన షరతుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించారా..? అంటే అవునన్నా సమాధానమే అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. టిడిపి – జనసేన మధ్య కుదిరిన పొత్తు వివరాలు, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దం కావడానికి వెనుకున్న కారణాలు వంటి విషయాలను తెలుసుకుందాం.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. కొద్దిరోజులుగా దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చినప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడ బయటకు వెల్లడించలేదు. అయితే ఇరు పార్టీలకు సంబంధించిన కీలక వ్యక్తులు చెబుతున్న సమాచారం మేరకు.. టిడిపి – జనసేన మధ్య పొత్తు ఖరారు అయిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టిన పలు కీలక షరతులకు కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తు వివరాలను కొద్ది రోజుల్లోనే అధికారికంగా ఇరు పార్టీల నేతలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
పొత్తుపై రకరకాల ఊహాగానాలు..
వచ్చే సార్వత్రిక ఎన్నికలను తెలుగుదేశం పార్టీ – జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీని అధికారంలో నుంచి దించడానికి పొత్తుకు సిద్ధమయ్యాయి. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన సగం సగం సీట్లలో పోటీ చేస్తాయని, కాదు జనసేనకు 30-35 సీట్లకు మించి ఇవ్వడం లేదని.. ఇలా అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ముందు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు ఉంటేనే కలిసి వెళ్తామని అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లు ప్రస్తుతం తెలుస్తోంది.
పొత్తు ఎవరితో ఉన్న సీఎం గా పవన్ కళ్యాణ్..
జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పార్టీ పురోగతి కనిపించలేదు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యంగా జనసైనికులు పనిచేస్తున్నారు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు గాని.. సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొత్త చర్చల్లో భాగంగా చంద్రబాబు నాయుడు వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లు తెలిసింది. సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే పొత్తు పెట్టుకునే విషయంలో జనసైనికులు ఆగ్రహంతో ఉండే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా చంద్రబాబుకు తెలియజేశారు. దీంతో అన్ని రకాలుగా ఆలోచించిన చంద్రబాబు నాయుడు సీఎం గా పవన్ కల్యాణ్ ఉండేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

జనసేన రెండున్నర ఏళ్ళు.. రెండున్నర ఏళ్ళు టీడీపీ..
పొత్తులో భాగంగా ముందుకు వెళ్లాలని భావించిన ఇరు పార్టీలు.. అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ కు అంగీకరించుకున్నాయి. మొదటి రెండున్నర ఏళ్ళు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు ఉంటారు. మిగిలిన రెండేళ్లు టిడిపి నుంచి ఒకరు సీఎం గా ఉంటే, జనసేన నుంచి ఒకరు డిప్యూటీ సీఎం గా పని చేయనున్నారు. ఈ మేరకు పొత్తు ఒప్పందం క్లియర్ అయినట్లు చెబుతున్నారు.
పొత్తు వద్దంటున్న సీనియర్లు.. ఒక సెక్షన్ మీడియా..
పవర్ షేరింగ్ షరతుతో అయితే పొత్తు వద్దన్న వాదనను పలువురు సీనియర్ టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఈ విధంగా అయితే పొత్తుకు వెళ్ళవద్దంటూ టిడిపి ముఖ్య నాయకులకు, చంద్రబాబుకు చెబుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ షరతులకు అంగీకరించిన చంద్రబాబు నాయుడు.. ఇటువైపు నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే ప్రకటన చేయలేకపోతున్నారని విశ్లేషణలు ఉన్నాయి. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉండాలని, అవసరమైతే ఐదు నుంచి పది సీట్లు అధికంగా జనసేనకు కట్టబెట్టాలని పలువురు టిడిపి సీనియర్ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికైతే ఉన్న సమాచారం ప్రకారం పవర్ షేరింగ్ కు అనుకూలంగానే పొత్తు కుదిరింది. ఈ మేరకు పొత్తు విషయాలను వెల్లడిస్తారా..? లేక తెలుగుదేశం పార్టీ పొత్తుపై పునరాలోచన చేస్తుందా అన్నది కొద్ది రోజుల్లోనే తెలియాల్సి ఉంది.