
TDP- Senior NTR: తెలుగుదేశం పార్టీకి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. అప్పటికీ..ఇప్పటికీ ఆయన బొమ్మతోనే టీడీపీ రాజకీయాలు నడుపుతోంది. కానీ అదే పార్టీ నుంచి ఎన్టీఆర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. దానిని ఎత్తివేశారా? లేదా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అదో సంచలన నిజంగా మిగిలిపోయింది..కానీ సస్పెన్షన్ కు గురైన ఎన్టీఆర్ పేరు చెప్పందే ఆ పార్టీకి, నేతలకు పూటగడవని పరిస్థితి నెలకొంది. తొలిసారిగా నాదేండ్ల భాస్కరరావు రూపంలో వెన్నుపోటు ఎదురైనా ఎన్టీఆర్ కుదురుకున్నారు కానీ.. చంద్రబాబు రూపంలో ఎదురైన సంక్షోభాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయారు. చివరకు అవమాన భారంతో మంచం పట్టారు. అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు.
చంద్రబాబును వెంటాడుతున్న వెన్నుపోటు అపవాదు..
అయితే చంద్రబాబు సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించినా.. వెన్నుపోటు అన్న అపవాదు నుంచి మాత్రం బయటపడలేకపోయారు. చాలా సందర్భాల్లో దీనిపై స్పష్టతనిచ్చినా వెన్నుపోటు అంశం నీడలా వెంటాడుతోంది. చంద్రబాబు రాజకీయ చరిత్రకు అదో మాయని మచ్చలా మిగిలిపోయింది. నాటి 1995 సంక్షోభంలో ముందుగా వేటుకు గురైంది చంద్రబాబే. కానీ దానిని అధిగమించి తిరిగి ఎన్టీఆర్ నే సస్పెండ్ చేసి పార్టీని హస్తగతం చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ, శాసనసభ్యత్వాలు కూడా రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ 1995 ఆగస్టు 25న నాటి స్పీకర్ యనమల రామక్రిష్ణుడుకి లేఖ రాశారు. కానీ దానికి ఒక రోజు ముందే.. పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు శకం ప్రారంభమైంది. ఎన్టీఆర్ పతనం ప్రారంభమై పతాక స్థాయికి చేరుకుంది. చివరకు ఎన్టీఆర్ ప్రాణాలు వదిలేందుకు దోహదపడింది.
సహేతుకమైన సమాధానమేదీ?
అయితే నాటి పరిస్థితులకు అనుగుణంగా పార్టీని కాపాడుకునేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పినా.. లక్ష్మీపార్వతినే కార్నర్ చేసినా సహేతుకమైన సమాధానం చెప్పలేకపోయారని ఇప్పటికీ కామెంట్స్ ఉన్నాయి. బాబు సారధ్యంలోని టీడీపీ.. 1995, ఆగస్టు 24న ఎన్టీఆర్ పై సస్పెన్ వేటువేసి, బాబునే టీడీఎల్పీ నేతగా ఎన్నుకుంది. దీంతో ఎన్టీఆర్ చంద్రబాబు అండ్ కో పై వేసిన సస్పెన్సన్ వేటుకు ప్రాధాన్యం లేకుండాపోయింది. అనంతరం వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన ఘటనల్లో.. ఆగస్టు 27న ఎన్టీఆర్ పై చెప్పుల దాడి జరిగింది. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత ఎన్టీఆర్ కన్నుమూశారు.

అదో మిస్టరీగానే..
ఎన్టీఆర్ బొమ్మతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆయనపై వేసిన సస్పెన్షన్ ఎత్తివేశారా? లేదా? అని ఇప్పటికీ స్పష్టతనిచ్చిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్ టీడీపీని అచేతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సాకు చూపి నాడు సస్పెన్షన్ వేశారు. బహుశా రాజకీయ చరిత్రలోనే పార్టీ వ్యవస్థాపకుడే.. పార్టీని బలహీనపరుస్తున్న అపవాదు ఎదుర్కొన్న వ్యక్తి ఎన్టీఆరే. కానీ కాలక్రమంలో అ అంశం మరుగున పడింది. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్న చంద్రబాబుకు మరోసారి పాలన అందించి ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు. అటు ఎన్టీఆర్ కుటుంబం సైతం చంద్రబాబుతో చేతులు కలిపి ‘సస్పెన్షన్’ అన్న మాట మరిచిపోయింది. పోయినోళ్లు అందరూ మంచోళ్లు. వాళ్లు చేసినవి తిపి గురుతులు అన్నట్టు.. చనిపోయిన మనిషి తన వెంట సస్పెన్షన్ ఆర్డర్ తీసుకెళ్లిపోయారు. ఇక తాము చేసిందేమిటి అన్నట్టు ఆయన విగ్రహాలను, చిత్రపటాలను ఓన్ చేసుకున్న చంద్రబాబు కూడా సస్పెన్షన్ వేటుపై సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. అదో సంచలన నిజంగా మిగిలిపోయిందే తప్ప.. ఆ మిస్టరీని ఛేదించే సాహసం సైతం ఎవరూ చేయలేదు.