Telugu Desam Party: తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవించిన పార్టీ తెలుగు దేశం. మొన్నటి వరకు ఉదయించే సూర్యుడిలా ఏటేటా కాంతిని వెదజల్లుతూ.. ఉజ్వలంగా వెలిగిన టీడీపీ ప్రస్తుతం అస్తమిస్తున్న భానుడిలా కాంతి విహీనంగా మారుతోంది. నాటి వెలుగులు కరువైంది. ప్రాభవం కోల్పోయింది. తనకు తానుగా నిలబడలేని దుస్థితి. వృద్ధాప్యంలో మనిషికి ఊతకర్ర ఎలా అవసరమో ప్రస్తుతం టీడీసీ కూడా తాను నిలబడేందుకు పొత్తు అనే ఊతకర్ర కోసం ఎదురు చూడాల్సిన దయనీయ స్థితి. ప్రస్తుత టీడీపీ పరిస్థితిని చూసి నాటి తరం నేతలు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మండే సూర్యుడిగా స్వయం ప్రకాశ శక్తి అయిన టీడీపీ, నేడు ‘చంద్రుడి‘లా పరాయి పార్టీల ప్రాపకం కోసం దిగజారి పోవడం, తనకు తానుగా అధికారంలోకి రాలేననే భయం టీడీపీ అధినేతతోపాటు క్యాడర్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది.
డూ ఆర్ డై..
దమ్ము, ధైర్యం వుంటే ఒంటరిగా రా అని తనకంటే 30 ఏళ్ల చిన్నదైన వైఎస్సార్‌సీపీ సవాల్ విసిరే స్థాయికి టీడీపీ దిగజారింది. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు పార్టీ కంటే లోకేశ్ భవిష్యత్‌పై ఎక్కువ భయం దోళనల్ని కలిగిస్తోంది. అనేక ప్రతికూల పరిస్థితుల్లో మహానాడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ తన వాస్తవ పరిస్థితిపై అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మహానాడును ఘనంగా నిర్వహించతలపెట్టింది. రానున్న ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌ను తేల్చేవి. అందుకే ఆ పార్టీ రానున్న ఎన్నికలను ‘డూ ఆర్ డై’ అనే రీతిలో సవాల్‌గా తీసుకుంది. ఎన్నికల యుద్ధానికి శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు.
నేల విడిచి సాము..
నాలుగు దశాబ్దాల టీడీపీ ప్రస్థానంలో అనేక ఉత్థానపతనాలున్నాయి. తెలుగు రాజకీయాలను, సామాజిక చైతన్యాన్ని తెలుగుదేశం ఆవిర్భావం ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సి వుంటుంది. అంతగా తెలుగు నేలపై టీడీపీ తనదైన ముద్ర వేసింది. టీడీపీ చరిత్ర విషయానికి వస్తే.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
ఎన్టీఆర్ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. చంద్రబాబునాయుడి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల ఓట్లతో అందలం ఎక్కడం తప్ప, వారికి పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శ ఉంది. కార్పొరేట్ శక్తులకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. నేల విడిచి సాము చేశారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తెలిసొచ్చింది. అంతేకాదు, గతంలో టీడీపీలో సమష్టితత్వం కనిపించేది. కాలం గడిచేకొద్ది ఆ పార్టీలో వ్యక్తి స్వామ్యం పెరుగుతూ వస్తోంది. పార్టీ, దాని సిద్ధాంతాలకంటే చంద్రబాబు, ఆ తర్వాత లోకేశే లోకమన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఈ వైఖరే పార్టీ బలహీనతకు కారణమనే చేదు నిజాన్ని గ్రహించినట్టు లేదు.
ప్రజలే దేవుళ్లుగా భావించిన ఎన్టీఆర్..
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ల నినాదంతో అశేష తెలుగు ప్రజల ఆదరణను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పొందారు. అప్పుడు వేసిన పునాదులు బలమైనవి కావడం వల్లే … ఎన్నో ఆటుపోట్లు వచ్చినా టీడీపీ బలంగా నిలిచింది. అయితే కలకాలం ఆ పునాదులు అట్లే ఉండవు.
అవసరం కోసం ఆత్మగౌరవం తాకట్టు..
టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చాక.. ఆవిర్భావ నినాదం ఆవిరైంది. వ్యక్తిగత అవసరాలు.. అధికారమే ప్రార్టీ ప్రాధాన్యాలుగామారాయి. అధికారం కోసం సొంత ఎజెడాను పక్కనబెట్టి… శత్రువుకు తలవంచేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. 1995 ముందుకు వరకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీసీ చంద్రబాబు నాయకత్వంలో ఏనాడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదు. మొదట్లో సీసీఐ, సీపీఎం, తర్వాత బీజేపీ, తర్వాత జనసేన, బీజేపీ, 2019లో బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపింది. ఎన్టీఆర్ ఎవరి అహంకారాన్ని తలదించాలనుకున్నారో.. అదే పార్టీ అధినేతలకు చంబ్రాబు అధికారం కోసం వంగివంగి దండాలు పెట్టడం పార్టీ అభిమానులకు, సీనియర్లకు నచ్చలేదు. అందుకే సిద్ధాంతాన్ని మచ్చిన పార్టీకి చాలామంది దూరమవుతున్నారు కూడా. ఒకప్పుడు తటస్తులను సైతం టీడీపీ వైపు తిప్పగలిగిన చంద్రబాబు.. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లని కూడా కాపాడుకోలేకపోతుండడం పార్టీ దీనస్థితికి, వ్యక్తి స్వామ్యానికి అద్దంపడుతోంది.
సునామీలా దూసుకొస్తున్న జగన్..
పాలనలోనూ, పనుల్లోనూ, పదవుల్లోనూ అన్నివర్గాలకు సమప్రాధాన్యం నినాదంతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సునామీలా దూసుకొస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి వెన్నెముక అయిన బీసీలను తన వైపు తిప్పుకోగలిగారు. సోషల్ ఇంజనీరింగ్ విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల పదవులను గతంలో ఎన్నడూ లేని విధంగా 70 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కట్టబెట్టారు. టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీ అనేది గతం. వర్తమానంలో ఆ క్రెడిట్ వైసీపీకి వెళుతోంది. ముందు ఈ వాస్తవాన్ని టీడీపీ జీర్ణించుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి భవిష్యత్.
అహంకార ధోరణి..
చంద్రబాబు తప్ప రాష్ట్రానికి, టీడీపీకి మరో ప్రత్యామ్నాయం లేదనే చెప్పడం ఆ పార్టీ బలహీనతకు సంకేతం. 2019లో తమను ఘోరంగా ఓడించిన ప్రజలదే తప్పనే అహంకార ధోరణి నుంచి ముఖ్యంగా చంద్రబాబు బయటపడాలి. తమ పాలనలో తప్పులేం జరిగాయో సమీక్షించుకోవాలి. పాలనలో ప్రజల్ని బాధించిన అంశాలపై క్షమాపణ చెప్పాలి. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు, లోకేశ్, మిగిలిన టీడీపీ నేతలు మారాలి. అప్పుడే ప్రజల మనసులను చూరగొనే అవకాశం వుంటుంది. వ్యక్తులను కాకుండా పార్టీని, వ్యవస్థల్ని బలోపేతం చేసేలా మహానాడు వేదిక కీలక నిర్ణయాలు తీసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో నిలబడగలుగుతుంది. లేదంటా ఇక భవిష్యత్ అంతా అంధకారమే!
Also Read:Venkatesh Fun with Bithiri Sathi : బిత్తిరి సత్తికి లైవ్ లోనే షాకిచ్చిన వెంకటేశ్